బ్రిట‌న్‌ పై ట్రంప్ ఫైర్‌.. రీజ‌న్ ఇదే

Update: 2017-11-30 08:23 GMT
స‌యోధ్య‌కు పెట్ట‌ని కోట‌లా ఉండే అమెరికా - బ్రిట‌న్‌ ల మ‌ధ్య ట్వీట్లు చిచ్చు రేపుతున్నాయి. ముఖ్యంగా ఇరు దేశాలూ వ్య‌తిరేకిస్తున్న ముస్లి వ్య‌తిరేక అంశమే.. ఈ దేశాల మ‌ధ్య వివాదానికి - మాట‌ల యుద్ధానికి కార‌ణ‌మైంది. ఈ క్ర‌మంలో ఇరు దేశాధి నేత‌లు కూడా ఒక‌రిపై ఒక‌రు మాట‌ల తూటాలు పేల్చుకున్నారు. మొత్తానికి టీ క‌ప్పులో తుఫాను మాదిరిగా ప్రారంభ‌మైన ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి. విష‌యంలోకి వెళ్తే.. బ్రిటన్‌ ఫస్ట్‌ అనే జాతీయవాద గ్రూపు డిప్యూటీ లీడర్‌ జైడా ఫ్రాన్సెస్‌ ఇటీవల తన ట్విట్టర్‌ ఖాతాలో మూడు వీడియోలను పోస్టు చేశారు. ముస్లిం వలసదారులు ఓ చిన్నారిని కొట్టడం - వర్జిన్‌ మేరీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం - ఓ టీనేజీ కుర్రాడిని ముస్లిం యువత కొట్టి చంపడం.. వంటివాటిని ఆమె ట్వీట్ చేశారు. ఈ వీడియోలు ప్ర‌పంచ వ్యాప్తంగా పెను సంచ‌ల‌నంగా మారాయి.

సాధార‌ణంగా వీటిని చూసిన‌వారు.. జాలి ప‌డ‌డ‌మో?  లేక ఎందుకలా జ‌రిగింద‌ని బాధ‌ప‌డ‌డ‌మో చేస్తారు. అయితే, ఈ విష‌యంలో నేరుగా క‌లుగ జేసుకున్న అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. స‌ద‌రు మ‌హిళ చేసిన ట్వీట్ల‌ను రీ ట్వీట్ చేశారు. దీంతో వీటికి మ‌రింత ప్ర‌చారం వ‌చ్చేసింది. ఏకంగా అమెరికా అధ్య‌క్షుడే రీట్వీట్ చేయ‌డంతో అప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టించుకోని వారు సైతం వీటిని వీక్షించారు. ఈ ప‌రిణామంపై బ్రిట‌న్ ప్ర‌ధాని థెరిసా మే తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంత పెద్ద స్థాయిలో ఉన్న ట్రంప్ చేయ‌ద‌గ్గ ప‌నేనా.. ఇంకేమీ ప‌నులు లేవా? అని ఘాటుగా స్పందించారు.  ముస్లిం వ్యతిరేక వీడియోలను ట్రంప్‌ రీట్వీట్‌ చేయడం సరికాదని కూడా ఆమె అన్నారు.

అలాంటి వీడియోలను ట్రంప్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో రీట్వీట్‌ చేసి వాటికి ప్రచారం కల్పించడం ఎంతమాత్రం సరికాదని థెరిసా అన్నారు. దీంతో.. ముక్కుమీదే కొపం ఉండే ట్రంప్‌.. అగ్గిమీద గుగ్గిలంలా థెరిసాపై విరుచుకుప‌డ్డారు. మే.. తనపై దృష్టిపెట్టడం మాని.. మీ దేశం గురించి ఆలోచించాలని ట్రంప్‌ హితవు పలికారు.  ఈ మేర‌కు చేసిన ట్వీట్‌లో.. ‘ప్రధాని థెరిసా మే.. నాపై దృష్టి పెట్టడం మానండి. యూకేలో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఉగ్రవాదంపై ముందు దృష్టిపెట్టండి. మేం మంచిపనే చేస్తున్నాం' అంటూ ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. ఈ వివాదం ఇక్క‌డితో స‌మ‌సి పోయేలా లేద‌ని, మ‌రింత ముదురు తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏదేమైనా.. ముస్లిం వ్య‌తిరేక ట్వీట్ల‌ను ఇలా రీ ట్వీట్ చేయ‌డం వెనుక ట్రంప్ ఉద్దేశం ఏంట‌నే ప్ర‌శ్న‌లూ ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.
Tags:    

Similar News