నేష‌న‌ల్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించిన ట్రంప్!

Update: 2019-05-16 10:34 GMT
సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌. తాజాగా ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న ఇప్పుడు మార్కెట్ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంది. విదేశీ శ‌త్రువుల నుంచి దేశంలోని కంప్యూట‌ర్ నెట్ వ‌ర్క్ కు ముప్పు ఉంద‌న్న ఆయ‌న‌.. చైనా కంపెనీ హువావేని దృష్టిలో పెట్టుకొని తాజా వ్యాఖ్య‌లు చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

ఇటీవ‌ల అమెరికా.. దాని మిత్ర‌దేశాలు హువాయి కంపెనీ చైనా కోసం గూఢ‌చ‌ర్యం చేస్తుంద‌న్న ఆందోళ‌న‌ను వ్య‌క్తం చేస్తున్నాయి. అదే స‌మ‌యంలో హువావే 5జీ నెట్ వ‌ర్క్ ను వాడొద్దంటూ మిత్ర‌దేశాల‌పై అమెరికా తీవ్ర ఒత్తిడి తెస్తోంది. ఇదిలాఉండ‌గా ట్రంప్ ప్ర‌క‌ట‌న‌ను ఫెడ‌ర‌ల్ క‌మ్యునికేష‌న్స్ క‌మిష‌న్ ఛైర్మ‌న్ అజిత్ పై సానుకూలంగా స్పందించారు. అమెరికా నెట్ వ‌ర్క్ ను కాపాడుకోవ‌టానికి ఇది స‌రైన చ‌ర్య‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు.

ఇదిలా ఉంటే.. జాతీయ అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని ప్ర‌క‌టించిన అమెరికా.. మ‌రో చ‌ర్య‌ను కూడా తీసుకుంది. హువావే మీద ఆంక్ష‌ల్ని ప్ర‌క‌టించింది. ప్ర‌భుత్వ అనుమంతి లేకుండా అమెరికా సంస్థ‌ల నుంచి స‌ద‌రు సంస్థ ఎలాంటి సాంకేతిక‌త‌ను కొనుగోలు చేయ‌కూడ‌ద‌ని పేర్కొంది. తాజా నిర్ణ‌యంతో అమెరికా.. చైనాల మ‌ధ్య సంబంధాలు ఘోరంగా దెబ్బ తినే అవ‌కాశం ఉందంటున్నారు.

ట్రంప్ ప్ర‌క‌ట‌న‌తో పాటు.. అమెరికా తీసుకున్న నిర్ణ‌యం నేప‌థ్యంలో హువావే స్పందించింది. తాము వ్యాపారం చేయ‌కుండా అమెరికా అడ్డుకుంటే.. దాని వ‌ల్ల అమెరికా వినియోగ‌దారులు.. కంపెనీలే ఇబ్బంది ప‌డ‌తాయ‌న్నారు. తాము ఏ ప్ర‌భుత్వానికి లోబ‌డి ప‌ని చేయ‌టం లేద‌న్నారు.

త‌మ‌తో బిజినెస్ చేయ‌నంత మాత్రాన అమెరికా ఏమీ భ‌ద్రంగా ఉంద‌న్న కీల‌క వ్యాఖ్య‌ల్ని హువావే చేయ‌టం గ‌మ‌నార్హం. త‌మ‌తో వ్యాపారం చేయ‌కుండా అమెరికా ఖ‌రీదైన ఇత మార్గాల వైపు వెళుతుంద‌ని.. దీని కార‌ణంగా భారం ఖాయ‌మ‌న్న అర్థం వ‌చ్చేలా వ్యాఖ్య‌లు చేసింది. ఇటీవ‌ల కాలంలో అమెరికా.. చైనా మ‌ధ్య వాణిజ్య ట‌ర్మ్స్ బాగోలేని వేళ‌.. ట్రంప్ తాజా నిర్ణ‌యం ఇరు దేశాల మ‌ధ్య సంబంధాల్ని మ‌రింత బ‌ల‌హీన ప‌ర్చేలా చేస్తాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News