తేడా వ‌స్తే డ్రోన్ల‌తో లేపేయ‌మంటున్న ట్రంప్‌

Update: 2017-03-16 06:33 GMT
ఉగ్ర‌వాదుల విష‌యంలో క‌ఠినంగ వ్య‌వ‌హరిస్తాన‌ని చెప్పిన అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విష‌యంలో ఏమాత్రం వెన‌క్కు త‌గ్గేది లేద‌నే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అనుమానిత ఉగ్రవాదులపై డ్రోన్‌ దాడులను కొనసాగించేందుకు అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ (సిఐఎ)కు అధ్యక్షుడు ట్రంప్‌ అనుమతి జారీ చేశారని అమెరికన్‌ మీడియా తన వార్తా కథనాలలో వెల్లడించింది. గతంలో ఈ అధికారం పూర్తిగా పెంటగాన్‌ పరిధిలో ఉండేదని మీడియా వివరించింది. గతంలో సీఐఎకు ఉన్న పారామిలటరీ పాత్రను కుదిస్తూ అప్పటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా చేపట్టిన విధానాలకు భిన్నంగా ఇప్పుడు ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం వుందని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక తన కథనంలో వెల్లడించింది.

ఒబామా హయాంలో సీఐఎ డ్రోన్‌లను ఇంటెలిజెన్స్‌ సమాచార సేకరణ, అనుమానిత ఉగ్రవాదుల గుర్తింపు వంటి చర్యలకు మాత్రమే ఉపయోగించేవారు. దాడులను మాత్రం సైన్యం ఆధ్వర్యంలో నిర్వహించే వారని మరో వార్తా సంస్థ తన కథనంలో తెలిపింది. ట్రంప్‌ తాజా నిర్ణయం ప్రధానంగా సిరియాలో సీఐఎ కార్యకలాపాలకు వర్తిస్తుందని, క్రమంగా దీనిని యెమెన్‌, లిబియా, సోమాలియా తదితర దేశాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని అధికారులు చెప్పిన‌ట్లు మీడియా వివ‌రించింది. ఉగ్ర‌వాదానికి తాను ఎంత వ్య‌తిరేక‌మో చాటిచెప్ప‌డంలో ట్రంప్ వేసిన మ‌రో ముంద‌డుగు అని వైట్ హౌస్ వ‌ర్గాలు చెప్తున్న ట్లు మీడియా పేర్కొంది.

ఇదిలాఉండ‌గా...తన ఫోన్లు ట్యాపింగ్‌ కు గురయ్యాయంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ట్వీట్లు చేశారంటే దానర్ధం ఎవరిపైనో ఆరోపణలు చేసినట్లు కాదని, సాధారణ నిఘా కార్యకలాపాల గురించే ఆయన మాట్లాడారని వైట్‌హౌస్‌ ప్రతినిధి స్పైసర్‌ వివరించారు. ఒబామా ప్రభుత్వాన్ని ట్రంప్‌ ప్రశ్నించారని తాను భావించడం లేదని, 2016 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా జరిగిన నిఘా, ఇతర కార్యకలాపాల గురించే ఆయన మాట్లాడారని తెలిపారు. సాధారణ నిఘా కార్యకలాపాల తీరు తెన్నులపై ప్రతినిధుల సభ-సెనేట్‌ ఇంటెలిజెన్స్‌ కమిటీలు కూలంకషంగా దర్యాప్తు జరిపి ఒక నివేదికను అధ్యక్షుడికి అందచేస్తాయని తెలిపారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో వివిధ తరహాల్లో నిఘాలు చోటు చేసుకున్నాయంటూ కొన్ని మాసాలుగా వివిధ వర్గాల నుండి అనేక వార్తలు వస్తున్నాయని అన్నారు. ఎన్నికల తేదీకి ముందు రోజు ట్రంప్‌ టవర్‌ లో ఫోన్లు ట్యాపింగ్‌ గురయ్యాయని చెప్పడానికి సాక్ష్యాధారాలు కావాలంటూ ట్రంప్‌ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో స్పైసర్‌ వ్యాఖ్యలు వెలువడ్డాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News