గ్రీన్‌ కార్డుల‌ తీపిక‌బురు..మ‌నోళ్ల ఖుష్‌

Update: 2018-02-09 17:11 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదిస్తున్న విధానంతో గ్రీన్‌ కార్డుల జారీ పెండింగ్‌ కు చెక్‌ పెట్టొచ్చని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌ హౌస్‌ వెల్లడించింది. లాటరీ విధానాన్ని రద్దు పరచి ప్రతిభ ఆధారిత వీసాలు ఇవాలని ట్రంప్‌ సూచించిన వలస విధానంతో నైపుణ్యంగల ఉద్యోగుల గ్రీన్‌ కార్డుల దరఖాస్తులు పెండింగ్‌ లో ఉండకుండా త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉందని వైట్‌హౌస్‌ స్పష్టం చేసింది. గ్రీన్‌ కార్డుల విషయంలో దేశాల కోటాను రద్దు చేయాలని గత కొంతకాలంగా భారతీయుల నుంచి వస్తున్న డిమాండ్‌ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష భవనం ఈ ప్రకటన చేసింది. ఒక్కో దేశానికి 7 శాతం కోటా కేటాయింపుతో హెచ్‌-1 బీ వీసాల ద్వారా వస్తున్న భారతీయులు చాలా ఇబ్బంది పడుతున్నారు.

పెద్ద సంఖ్యలో భారతీయ-అమెరికన్ల గ్రీన్‌ కార్డులు ఏళ్లుగా పెండింగ్‌ లో ఉన్నాయి. పాత విధానం వల్ల గ్రీన్‌ కార్డులు పొందేందుకు భారతీయ-అమెరికన్లు సుమారుగా 70 ఏండ్లు ఎదురుచూడాల్సిన గత్యంతరం ఉండేది. వలస విధానంలో మార్పులు చేయడం ద్వారా తమకు న్యాయం చేయాలంటూ అమెరికాలో ఉంటున్న భారతీయులు గత కొంతకాలంగా వైట్‌ హౌస్‌ సహా అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహించి ట్రంప్‌ ప్రభుత్వాన్ని - కాంగ్రెస్‌ ను డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అవలంభిస్తున్న వలస విధానాన్ని రద్దు చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు వాటిల్లుతున్న నష్టాన్ని నివారించేందుకు సిద్ధమైనట్లు వైట్‌ హౌస్‌ ప్రకటించింది.

శుక్రవారం నాడు తన ట్విట్టర్‌ నుంచి ట్వీట్‌ చేసిన డొనాల్డ్‌ ట్రంప్‌ - లాటరీ విధానాన్ని రద్దు చేయాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మంచి వలస విధానాన్ని రూపొందించి అమెరికాను కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ పై ఉందని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. కాగా న్యాయపరమైన వలసలు జరగాలని ట్రంప్‌ ప్రభుత్వం భావిస్తున్నదని, అందుకు తగినట్లుగా సిద్ధం చేస్తున్న ప్రతిపాదనలు అక్రమ వలసల్ని నివారించేలా ఉందని తొలిసారి నిర్వహించిన మీడియా సమావేశంలో వైట్‌ హౌస్‌ డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీ రాజ్‌ షా తెలిపారు.

Tags:    

Similar News