ట్రంప్ నిర్ణ‌యంతో 3ల‌క్ష‌ల ఇండియ‌న్ల‌కు చుక్క‌లు

Update: 2017-02-22 13:05 GMT
అమెరికాలో అక్ర‌మంగా ఉంటున్న కోటి ప‌ది ల‌క్ష‌ల మంది వ‌ల‌స‌దారుల‌ను దేశం నుంచి పంపించేందుకు  డొనాల్డ్ ట్రంప్ ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది.ఈ మేర‌కు హోమ్‌ లాండ్ సెక్యూరిటీ అధికారుల‌కు బుధ‌వారం ఆదేశాలు జారీ చేసింది. అప్పుడే ఆ శాఖ త‌మ ప‌ని కూడా మొద‌లుపెట్టేసింది. ఎవ‌రైనా ఇమ్మిగ్రేష‌న్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించార‌న్న అనుమానం వ‌స్తే చాలు.. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసే అధికారం ఈ డిపార్ట్‌ మెంట్ అధికారుల‌కు ఇచ్చిన‌ట్లు హోమ్‌ లాండ్ సెక్యూరిటీ ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. అమెరికా ప్ర‌భుత్వ తాజా ఆదేశాల‌తో స‌రైన ప‌త్రాలు లేకుండా ఉంటున్న కోటి మందికిపైగా వ‌ల‌స‌దారులు బిక్కుబిక్కుమంటున్నారు. ఇందులో 3 ల‌క్ష‌ల మంది ఇండియ‌న్‌-అమెరిక‌న్లు ఉన్న‌ట్లు అంచ‌నా.

తాజా నిబంధ‌న‌తో ఇక నుంచి ఇలాంటివారిని ఏరేయ‌డంలో క్లాసులు - కేట‌గిరీలు వంటివి ఏమీ ఉండ‌వ‌ని హోమ్‌ లాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌ మెంట్ స్ప‌ష్టంచేసింది. అక్ర‌మ వ‌ల‌స‌దారులను దేశం నుంచి పంపించేయ‌డానికి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు ఆ శాఖ రెండు ఎన్‌ ఫోర్స్‌ మెంట్ మెమోలు జారీ చేసింది. ప్ర‌స్తుతానికి క్రిమిన‌ల్ కేసులున్న అక్ర‌మ వ‌ల‌స‌దారులే త‌మ ల‌క్ష్య‌మ‌ని అంటున్నా.. మెల్ల‌గా అంద‌రూ దేశం వ‌దిలి వెళ్లాల్సిందేన‌ని ఆ శాఖ చెప్పింది. ఇలా ప‌ట్టుబ‌డ్డ‌వారు మ‌ళ్లీ అక్ర‌మంగా అమెరికాలో అడుగుపెట్ట‌బోమ‌ని హామీ ఇస్తే.. వారిని ఏ దేశాల నుంచి వ‌చ్చారో అక్క‌డికి తిరిగి పంపించేయ‌నున్నారు. అయితే వారిపై కేసుల విచార‌ణ మాత్రం కొన‌సాగుతూనే ఉంటుంది.

ఇదిలాఉండ‌గా..ట్రంప్ ప్ర‌భుత్వ ఆదేశాల‌ను డెమొక్రాట్లు తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. ఈ ఆదేశాల‌పై వెంట‌నే విచార‌ణ జ‌రిపించాల‌ని ఇల్లినాయిస్ డెమొక్ర‌టిక్ సెనేట‌ర్ డిక్ డ‌ర్బిన్‌.. ఇమ్మిగ్రేష‌న్ స‌బ్‌ క‌మిటీ చైర్మ‌న్ జాన్ కార్నిన్‌ ను డిమాండ్ చేశారు. హోమ్‌ లాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌ మెంట్ విడుద‌ల చేసిన మెమోల ప్ర‌కారం.. దేశంలో అక్ర‌మంగా ఉంటున్న‌వారిని జ‌డ్జి ముందు హాజ‌రుప‌ర‌చాల్సిన అవ‌స‌రం లేకుండానే దేశం నుంచి పంపించేయ‌వ‌చ్చ‌ని అమెరిక‌న్ ఇమ్మిగ్రేష‌న్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ బెత్ వెర్లిన్ అన్నారు. దేశంలో అక్ర‌మంగా ఉంటూ దేశ భ‌ద్ర‌త‌కు స‌వాలు విసిరే క్రిమినల్స్ త‌మ మొద‌టి లక్ష్య‌మ‌ని వైట్‌ హౌజ్ కూడా స్ప‌ష్టంచేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News