డ్రీమ‌ర్లను హ్యాపీ చేసే మాట చెప్పిన ట్రంప్‌

Update: 2018-01-26 05:10 GMT
త‌న నిర్ణ‌యాల‌తో షాకుల మీద షాకులు ఇచ్చే అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న తీరుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించారు. కొన్ని అంశాల విష‌యంలో క‌టువుగా వ్య‌వ‌హ‌రించే ఆయ‌న‌.. తాజాగా చెప్పిన మాట ల‌క్ష‌లాది మందిని హ్యాపీగా చేస్తోంది. ట్రంప్ మాట అమెరికాలో ఉన్న ల‌క్ష‌లాది మంది డ్రీమ‌ర్ల‌ను సంతోషానికి గురి చేస్తోంది. ఇంత‌కీ ఈ డ్రీమ‌ర్లు ఎవ‌రు?  వీరిని అంత హ్యాపీ చేసేలా ట్రంప్ ఏం చెప్పార‌న్న‌ది చూస్తే..

స‌రైన అధికారిక ప‌త్రాలు లేకుండా అమెరికాలోకి వ‌చ్చిన ఇత‌ర దేశ‌స్తులు.. త‌మ‌తో పాటు త‌మ పిల్ల‌ల్ని తీసుకొచ్చిన వారిని డ్రీమ‌ర్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. త‌మ‌కేమీ అవ‌గాహ‌న లేని స‌మ‌యంలో త‌ల్లిదండ్రుల‌తో పాటు వ‌చ్చేసే పిల్ల‌ల‌కు.. అమెరికాలో అధికారికంగా నివ‌సించే అనుమ‌తి ఉండ‌దు. ఇలాంటి వారు అమెరికాలో దాదాపు 6.90ల‌క్ష‌ల మంది ఉన్న‌ట్లు చెబుతారు. ఇలాంటి వారంద‌రిని డ్రీమ‌ర్లుగా చెబుతారు.

పేరెంట్స్ వ‌చ్చేసిన వీరు.. త‌మ‌కు అమెరికా పౌర‌స‌త్వం ఇవ్వాల‌న్న డిమాండ్‌ను ఎప్ప‌టి నుంచో చేస్తున్నారు. వీరికి పౌర‌స‌త్వం ఇచ్చేందుకు వీలుగా 2001లో ఒక బిల్లును సిద్ధం చేశారు. డీఆర్ ఈఏఎం పేరుతో ఉన్న ఈ బిల్లులో.. పౌర‌స‌త్వం కోసం ఎదురుచూసే వారిని డ్రీమ‌ర్లుగా పేర్కొన్నారు. అప్ప‌టి నుంచి వీరిని డ్రీమ‌ర్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం మొద‌లైంది.

ల‌క్ష‌లాదిగా ఉన్న డ్రీమ‌ర్ల‌లో భార‌త‌దేశానికి చెందిన వారు వేలాదిగా ఉన్నారు. ఇలాంటి వారికి ష‌ర‌తుల‌తో కూడిన పౌర‌స‌త్వం ఇవ్వాల‌న్న ఉద్దేశంతో బిల్లు పెట్టారు. కానీ.. ఈ బిల్లు ఇప్ప‌టివ‌ర‌కూ ఆమోదం పొంద‌లేదు. ఇదిలా ఉండ‌గా.. ఇటీవ‌ల ప్ర‌భుత్వ సంస్థ‌ల‌కు నిధులు అందించేందుకు ఉద్దేశించిన బిల్లుకు విప‌క్ష డెమోక్రాట్లు స‌సేమిరా అన‌టంతో కొద్దిరోజుల పాటు ప్ర‌భ‌త్వ సేవ‌ల‌న్నీ స్తంభించిపోయిన సంగ‌తి తెలిసిందే.

ఈ సంద‌ర్భంగా త‌మ మ‌ద్ద‌తు ఇవ్వాలంటే డ్రీమ‌ర్ల విష‌యంలో ట్రంప్ స‌ర్కారు సానుకూలంగా స్పందించాల‌ని.. డ్రీమ‌ర్ల‌కు పౌర‌స‌త్వం ఇచ్చేందుకు ఓకే అంటే తాము మ‌ద్ద‌తు ఇస్తామ‌ని ష‌ర‌తు విధించారు. దీంతో.. రిప‌బ్లిక‌న్లు ఓకే అన‌టంతో ఆర్థిక బిల్లు ఇష్యూ క్లోజ్ అయ్యింది. డ్రీమ‌ర్ల‌కు రానున్న ప‌ది నుంచి ప‌న్నెండేళ్ల వ్య‌వ‌ధిలో అమెరికా పౌర‌స‌త్వాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ట్రంప్ వెల్ల‌డించారు. రానున్న కొన్నేళ్ల వ్య‌వ‌ధిలో డ్రీమ‌ర్ల క‌ల నిజం కానుంద‌ని ట్రంప్ చెప్పారు. మొత్తానికి డ్రీమ‌ర్ల విష‌యంలో ట్రంప్ సానుకూలంగా ఉండ‌టం.. అందుకు త‌గ్గ‌ట్లు అధ్య‌క్షుల వారి నోటి నుంచి ప్ర‌క‌ట‌న రావ‌టంపై ప‌లువురు సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.
Tags:    

Similar News