ట్రంప్ గారూ.. ఇక చాలు.. ఆపుతారా ప్లీజ్!

Update: 2019-06-08 12:00 GMT
అమెరికా అధ్యక్షుడు  ట్రంప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఏం చేసినా వార్తే. ఎం మాట్లాడినా వార్తే. ఆయన అధికారంలోకి రావడమే పెద్ద విశేషం. అధికారంలోకి వచ్చింది మొదలు వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. మొదట ముస్లింలను దేశంలోకి అడుగుపెట్టొద్దంటూ హుకుం జారీ చేశారు. పలు ముస్లిం దేశాలపై ఆంక్షలు విధించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇది తీవ్ర దుమారం రేపడంతో కొంత వెనక్కి తగ్గారు.

మెక్సికో నుంచి వలసలను నివారించేందుకు తాను అధికారంలో వస్తే సరిహద్దులో గోడకట్టేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలో వచ్చాక అన్నంత పనీ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చారు. ఆ తర్వాత ఏమైందో ఎవరికీ తెలియదు. ఇక ప్రసంగాల్లో తప్పులు - స్పెల్లింగు మిస్టేకులతో చాలాసార్లు ట్రోల్ అయ్యారు. అయినప్పటికీ ట్రంప్ గారికీ అవేమీ పట్టవు. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతారు. ఇటీవల చైనాతో వాణిజ్య యుద్ధం ప్రారంభించారు. ఆ దేశానికి చెందిన మొబైల్ కంపెనీ హువావేపై ఆంక్షలు పెట్టి ఆ సంస్థను దాదాపు కుదేలు చేశారు. అమెరికా ఆంక్షలతో ఆ సంస్థ కష్టాల్లో కూరుకుపోయింది. గూగుల్ - ఫేస్‌ బుక్ సహా పలు సంస్థలు ఆ సంస్థకు  సేవలను నిలిపివేశాయి.

ఇక, ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్రంగా ట్రోల్ అవుతున్నాయి. అధ్యక్షుడి హోదాలో ఉండి అవేం మాటలంటూ నెటిజన్లతో పాటు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కూడా తప్పుబడుతోంది. ఇంతగా ఆయనేం మాట్లాడారయ్యా అంటే.. చంద్రుడు కూడా అరుణ గ్రహంలోని ముక్కేనంటూ సెలవిచ్చారు. మూడు వారాల క్రితం ట్రంప్ మాట్లాడుతూ తనకి చంద్రుడి పైకి వెళ్లే ఉద్దేశం ఉందంటూ మనసులో మాటను బయటపెట్టారు. ఇప్పుడేమో.. చంద్రుడిపైకి వెళ్లడం లాంటి చిన్నచిన్న విషయాలపై నాసా దృష్టి పెట్టడం మానేసి మార్స్‌ పై ల్యాండయ్యేలాంటి పెద్దపెద్ద విషయాల గురించి ఆలోచించాలని హితవు పలికారు. 50 ఏళ్ల క్రితమే చంద్రుడిపైకి వెళ్లామని - ఇప్పుడు ఆ విషయం గురించి ఆలోచించవద్దని నాసాను కోరారు. 

ట్రంప్ మాటలతో నాసా శాస్త్రవేత్తలు సహా ప్రపంచవ్యాప్తంగా అందరూ షాక్‌ కు గురయ్యారు. చంద్రుడు అరుణ గ్రహంలోని ముక్కేంటయ్యా బాబూ అంటూ ఆశ్చర్యపోతున్నారు. మాట్లాడేటప్పుడు కాస్తా ఆలోచించాలంటూ హితవు పలుకుతూ ట్రోల్ చేస్తున్నారు. ట్రంప్ భలే జోకులు వేస్తున్నారంటూ నెటిజన్లు నవ్వులు పూయించే కామెంట్లు చేస్తున్నారు.
Tags:    

Similar News