పుతిన్ కు హిల్ల‌రీ అంటేనే ఇష్టంః ట్రంప్‌

Update: 2017-07-13 09:15 GMT
ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న‌కు తాను ప్రెసిడెంట్ అవ‌డం ఇష్టంలేద‌ని, హిల్ల‌రీ  క్లింట‌న్ ప్రెసిడెంట్ కావాల‌ని ఆయ‌న కోరుకున్నార‌ని విమ‌ర్శించారు. జీ20 స‌మావేశాల్లో పుతిన్ తో భేటీ ఆయిన త‌ర్వాత ట్రంప్ మొద‌టిసారి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఈ వ్యాఖ్య‌లు చేశారు. అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారంలో ర‌ష్యా పేరును ట్రంప్ వాడుకుని అధ్య‌క్షుడ‌య్యాడ‌ని వ‌స్తున్న వార్త‌ల‌పై ఆయ‌న స్పందించారు.

హిల్ల‌రీ అమెరికా అధ్య‌క్షురాలిగా ఉంటే కనుక పుతిన్ బాగా సంతోషించేవాడ‌ని ఆయ‌న అన్నారు. తాను అధ్య‌క్షుడ‌య్యాక  ర‌ష్యాకు అనుకూలంగా ఒక్క‌ప‌ని కూడా చేయ‌లేద‌ని, హిల్ల‌రీ క్లింట‌న్ అధ్య‌క్షురాలై ఉంటే ర‌ష్యాకు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించేద‌ర‌న్నారు. తాను చేసిన మిల‌ట‌రీ సంస్క‌ర‌ణ‌లు, ఇంధ‌న సంస్క‌ర‌ణ‌లను పుతిన్ కు వ్య‌తిరేకంగా ఉన్నాయ‌ని, హిల్ల‌రీ అయితే పుతిన్ మెప్పు పొందేవార‌ని ట్రంప్ తెలిపారు.

జీ20 స‌మావేశాల‌లో పుతిన్ తో భేటీ విష‌యాల‌ను కూడా ట్రంప్ ప్ర‌స్తావించారు. త‌మ ఇద్ద‌రి మ‌ధ్య రెండు గంట‌ల‌కు పైగా సానుకూల విష‌యాలపైనే చ‌ర్చ జ‌రిగింద‌న్నారు. అణుశ‌క్తి ప‌రంగా బ‌లంగా ఉన్న రెండు దేశాల అధ్య‌క్షులు చెడు గురించి మాట్లాడుకుంటార‌ని భావించ‌డం స‌రికాద‌ని తెలిపారు.

తాను అమెరికా సైన్యాన్ని మ‌రింత బ‌లోపేతం చేయాల‌ని కోరుకుంటున్నాన‌ని, పుతిన్ కు అది ఇష్టం లేద‌ని ట్రంప్ తెలిపారు. ఒక వేళ హిల్ల‌రీ అధ్య‌క్షురాలై ఉంటే అమెరికా మిలిట‌రీ నాశ‌నం అయిపోయేద‌ని ఆయ‌న అన్నారు. ఆ విధంగా చేస్తుంది కాబ‌ట్టే హిల్ల‌రీ అధ్యక్షురాలు కావాల‌ని పుతిన్ కోరుకున్నాడ‌ని ట్రంప్ అన్నారు.
Tags:    

Similar News