మాటలతో మరోసారి బెంబేలెత్తించిన ట్రంప్

Update: 2016-08-28 12:12 GMT
కంపు నోటితో  డోనాల్డ్ ట్రంప్ ఎంతలా చెలరేగిపోతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మీడియాలో ప్రముఖంగా దర్శనమిచ్చే ఆయన.. తాజాగా మరోసారి తన అభిప్రాయాలు చెప్పే క్రమంలో చెలరేగిపోయారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే.. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారందరిని బహిష్కరించటం మొదలు పెడతానని స్పష్టం చేశారు.

అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసించే వారిని దేశాధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే తరిమే కార్యక్రమాన్ని తాను పెట్టుకోనున్నట్లుగా చెప్పారు. అక్రమ వలసదారుల కారణంగా నిరుద్యోగ సమస్య వస్తుందన్న వాదనను తెర మీదకు తెచ్చిన ఆయన.. ఒబామా సర్కారు వేలాది మంది వలసల్ని అనుమతించినట్లుగా విమర్శించారు.

తాను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే సరిహద్దుల్లో పేద్ద గోడను నిర్మిస్తానని చెప్పిన ట్రంప్.. ఎలక్ట్రానిక్ తనిఖీలు ఏర్పాటు చేసి.. వలసదారులకు చెక్ చెబుతానని చెప్పారు. సంక్షేమ.. ఇతర పథకాలు వలసదారులకు  వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పిన ఆయన.. వీసా గడువు దాటిన వారిని దేశం నుంచి పంపేందుకు ఎగ్జిట్.. ఎంట్రీ సిస్టంను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పటం గమనార్హం.

తనకు ఓటేస్తే చట్టాన్ని అమలు చేసే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. అదే హిల్లరీ క్లింటన్ కు ఓటు వేస్తే.. తెరిచి ఉంచిన సరిహద్దుల దేశంగా అమెరికా మారుతుందన్న వ్యాఖ్య చేశారు. వలసల మీద మొదటి నుంచి కఠిన వ్యాఖ్యలు చేస్తున్న ట్రంప్.. తన వైఖరికి తగ్గట్లే మరోసారి అక్రమ వలసల వ్యతిరేక వాదనను బలంగా వినిపించటమే కాదు.. తాను పవర్ లోకి వస్తే వారి సంగతి తుదికంటా చూస్తానన్న విషయాన్ని స్పష్టం చేసినట్లుగా చెప్పాలి.
Tags:    

Similar News