ట్రంప్ కెలికిన తాజా ర‌చ్చ‌..బ్రౌజింగ్ డేటా సేల్‌

Update: 2017-04-04 04:20 GMT
క‌దిలించుకొని మ‌రీ వివాదాల‌తో స‌హ‌జీవ‌నం చేయ‌టం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కు చేత‌నైనంత బాగా మ‌రెవ‌రికీ చేత‌కాదేమో.  అధ్య‌క్ష ప‌ద‌విని చేప‌ట్టిన నాటి నుంచి ఏదో ఒక వివాదంతో ఆగ‌మాగం అవుతున్నా.. వాటిని అస్స‌లు ప‌ట్టించుకోకుండా  తాను అనుకున్న‌ది చేసుకుంటూ పోవ‌టం ట్రంప్ లో క‌నిపిస్తుంటుంది.  తాజాగా అలాంటి రొచ్చులో అడుగేశారు ట్రంప్‌. ఒబామా హ‌యాంలో స్ప‌ష్ట‌మైన విధానాన్ని అనుస‌రించిన బ్రౌజింగ్ డేటా సేల్ ఇష్యూలో.. ట్రంప్ త‌న‌దైన శైలిలో ముందుకు వెళుతుండ‌టంపై పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతోంది. తాజాగా ఈ అంశంపై హౌజ్ ఆఫ్ రిఫ్ర‌జెంటేటివ్స్ లో చేసిన తీర్మానాన్ని చూస్తే.. ట్రంప్ సంత‌కం పెట్ట‌టం మాత్ర‌మే మిగిలి ఉంది. ఈ బ్రౌజింగ్ డేటా సేల్ అంశంపై పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇంత‌కీ ఈ బ్రౌజింగ్ డేటా సేల్ అంటే ఏమిట‌న్న‌ది చూస్తే.. ఇంట‌ర్నెట్ వినియోగ‌దారులు నిత్యం ఇంటర్నెట్‌ ను వినియోగిస్తున్న విష‌యం తెలిసిందే. ఇలా వాడే స‌మ‌యంలో వారు ర‌క‌ర‌కాల సైట్ల‌ను ఓపెన్ చేయ‌టం.. చూడ‌టం లాంటివి చేస్తుంటారు. ఈ సేల్ ఇష్యూ కానీ అధికారికం అయితే.. మార్కెటింగ్ సంస్థ‌లు ఈ బ్రౌజింగ్ హిస్ట‌రీని కొనుగోలు చేసి.. కంపెనీల‌కు సేవ‌లు అందిస్తాయి. ఒక‌వేళ అదే జ‌రిగితే ఏమ‌వుతుంద‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం వెతికితే.. ఇంట‌ర్నెట్‌ లో ఇప్పుడు ఎవ‌రేం చేసినా.. అది వారి వ్య‌క్తిగ‌తం. వారికి పూర్తి స్థాయి ప్రైవ‌సీ ఉంటుంది. కానీ.. ట్రంప్ సంత‌కం చేస్తార‌ని చెబుతున్న బ్రౌజింగ్ డేటా సేల్ విష‌యానికి వ‌స్తే.. పూర్తిగా వ్య‌క్తిగ‌త‌మైన ఈ స‌మాచారం అంగ‌డి వ‌స్తువు అవుతుంది. అప్పుడు ఎవ‌రైనా కొనుగోలు చేయొచ్చు. ఉదాహ‌ర‌ణ‌కు.. ఈ బిల్లు మీద ట్రంప్ కానీ సంత‌కం చేస్తే.. ఆయ‌న కానీ ఆయ‌న కుటుంబ స‌భ్యులు కానీ చేసే బ్రౌజింగ్ డేటాను కొనుగోలు చేసే అవ‌కాశం ఉంటుంది. ఇలా.. సామాన్యులు మొద‌లు అస‌మాన్యుల వ‌ర‌కూ తమ వ్య‌క్తిగ‌త అంశాల్ని షేర్ చేసే విష‌యాన్నీ ముడి స‌రుకుగా మారి.. ఎవ‌రైనా కొనుగోలు చేసుకునే వీలుఉంటుంది.

ప్రైవ‌సీని పూర్తి స్థాయిలో దెబ్బేసే ఈ బిల్లుపై ట్రంప్ సంత‌కం పెట్టొద్ద‌ని పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అంతేనా.. ఒక‌వేళ త‌మ డిమాండ్ల‌ను ప‌ట్టించుకోకుండా ట్రంప్ కానీ సంత‌కం పెడితే మాత్రం.. ఆయ‌న‌.. ఆయ‌న ప్ర‌భుత్వంలోని రాజ‌కీయ నేత‌ల బ్రౌజింగ్ డేటాను కొనుగోలు చేసి మొద‌ట బ‌జార్లో పెడ‌తామ‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఇదేదో అషామాషీ వ్య‌వ‌హారంగా కాకుండా.. ఇందుకోసం ఫండ్ రైజింగ్ కార్య‌క్ర‌మాన్ని షురూ చేశారు. మ‌రి.. వివాదాస్ప‌ద‌మైన బ్రౌజింగ్ డేటా సేల్ బిల్లుపై ట్రంప్ సంత‌కం చేస్తారా? అన్న‌ది ఇప్పుడు ఉత్కంట‌గా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News