స‌ర్వే షాకిస్తే...ట్రంప్ స‌ర్ది చెప్పారు

Update: 2016-11-25 10:01 GMT
త్వ‌ర‌లో అమెరికా అధ్య‌క్ష ప‌గ్గాలు చేప‌ట్ట‌నున్న రిప‌బ్లిక‌న్ పార్టీ నాయ‌కుడు డొనాల్డ్‌ ట్రంప్ ఆరంభంలోనే అమెరికా ప్ర‌జ‌లు ఝ‌ల‌క్ ఇచ్చారు. అమెరికాలో అక్రమ చొరబాట్ల నిరోధానికి మెక్సికో-అమెరికా సరిహద్దు గోడ నిర్మించాలంటూ గ‌తంలో ట్రంప్‌ ప్రతిపాదించిన సంగ‌తి తెలిసిందే. దీని పట్ల అధికశాతం మంది అమెరికన్లు విముఖత వ్యక్తం చేశారు. క్విన్నిపియాక్‌ యూనివర్శిటీ తాజాగా నిర్వహించిన ఒపీనియన్‌ పోల్‌ లో 55 శాతం మంది ఈ ప్రాజెక్టును వ్యతిరేకించారు. అయితే 42 శాతం ఈ ప్రతిపాదనతో ఏకీభవించటం విశేషం. ఈ నెల 17 నుండి 20 వరకూ నిర్వహించిన ఈ సర్వేలో దేశవ్యాప్తంగా దాదాపు 1,071 మంది ఓటర్లను టెలిఫోన్‌ ద్వారా ప్రశ్నించారు. చట్ట వ్యతిరేకంగా అమెరికాలో నివసిస్తున్న వలసదారులను అనుమతించాలన్న అంశాన్ని దాదాపు 60 శాతం మంది ఓటర్లు బలపర్చారు. వారిని తిప్పి పంపివేయాలని 25 శాతం మంది కుండ బద్దలు కొట్టారు. అయితే ఈ సర్వే ఫలితాలలో మూడు శాతం మేర తప్పొప్పులకు అవకాశం ఉంటుందని నిర్వాహకులు అంగీకరించారు.

ఇదిలా ఉండ‌గా ఎన్నిక‌ల్లో గెలిచిన నేప‌థ్యంలో దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ విడుదల చేసిన వీడియో సందేశంలో ప్ర‌జ‌ల‌కు ట్రంప్ ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌తిపాదన చేశారు. ప్రజలు తమ మధ్య విభేదాలను విస్మరించి ఒక్కటిగా ముందడుగు వేయాలని డొనాల్డ్‌ ట్రంప్‌ పిలుపునిచ్చారు. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించే రాజకీయ ప్రచారానికి తెరపడిందని, ఇప్పుడు జాతి పునర్నిర్మాణానికి సంబంధించిన ప్రచారం ప్రారంభమైందని అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ విభేదాలను విస్మరించి అమెరికాకు పునర్వైభవ సాధనకు ముందడుగు వేయాలని ట్రంప్ కోరారు. ప్రత్యర్థులపై వాడి వేడి విమర్శలతో కొనసాగిన ఎన్నికల ప్రచారానికి తెరపడిన‌ప్ప‌టికీ దీనితో చెలరేగిన ఉద్వేగాలు, ఉద్రిక్తతలు ఒక్కరాత్రిలో సమసిపోయేవి కావని తనకు తెలుసని ట్రంప్ అంగీక‌రించారు. అమెరికాను పూర్తిగా మార్చివేసి మన నగరాలు ప్రజలకు పూర్తి భద్రత కలిగించేందుకు చర్యలు తీసుకోవటం తనకు అత్యంత ప్రధానమన్నారు. ఈ లక్ష్యసాధనలో విజయం సాధించేందుకు ప్రతిఒక్కరూ ఈ కృషిలో భాగస్వాములు కావాలని ట్రంప్ కోరారు.

మ‌రోవైపు అమెరికా ప్ర‌స్తుత అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా త‌న ప‌ద‌వీ విర‌మ‌ణ ద‌గ్గ‌ర ప‌డుతున్న క్ర‌మంలో పౌరుల‌తో మ‌మేకం అవుతున్నారు. క్రిస్మ‌స్ నేప‌థ్యంలో అమెరికాలో థ్యాంక్స్‌ గివింగ్‌ వేడుకలు ప్రారంభ మయ్యాయి. అందులో భాగంగా బరాక్‌ ఒబామా అధ్యక్షుడుగా తన చివరి థాంక్స్ గివింగ్‌ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే ఈసారి తన కుమార్తెలకు బదులుగా తన మేనల్ళుళ్ళు ఇందులో పాల్గొంటున్నారని చెప్పారు. ఇకపై ప్రతీ ఏడాది కూడా తాము ఈ వేడుకలు చేసుకుంటామని, అయితే అప్పుడు కెమెరాలు వుండవని - కేవలం మనం మాత్రమే వుంటామని తన పిల్లలతో చెప్పినట్లు ఒబామా పేర్కొన్నారు. వైట్‌ హౌస్‌ లోని రోజ్‌ గార్డెన్‌ లో జరిగిన కార్యక్రమంలో మేనల్లుళ్ళు ఆస్టిన్‌ - ఆరాన్‌ రాబిన్సన్‌ లతో కలిసి ఒబామా కనిపించారు. థాంక్స్ గివింగ్‌ డే అనేది జాతీయ పటిష్టతకు ఒక చిహ్నమని ఒబామా వ్యాఖ్యానించారు. ఏ మతమైనా, ఏ తెగ అయినా మనందరం ఒకటి, అందరూ సమానులే అనే సందేశం ఇస్తుందని ఒబామా అన్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News