బ్యాన్‌ పై ట్రంప్ మాటే చెల్లింది

Update: 2017-06-27 04:59 GMT
అమెరికా అధ్య‌క్షుడి నిర్ణ‌యానికి ఆ దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం ఓకే చేసింది. అమెరికాలోని ప‌లువురు ప్ర‌జ‌ల‌తో స‌హా ప్ర‌పంచ దేశాలు తప్పు ప‌ట్టిన ట్రంప్ ట్రావెల్ బ్యాన్ ను ఆ దేశ అత్యున్న‌త కోర్టు ఓకే చేసింది. ఆరు ముస్లిం దేశాల నుంచి వ‌చ్చే పౌరుల‌పై జ‌న‌వ‌రిలో ట్రంప్ స‌ర్కారు జారీ చేసిన నిషేధ ఉత్త‌ర్వులను అనుమ‌తిస్తూ అమెరికా కోర్టు  ఆదేశాలు జారీ చేసింది.

ఆరు ముస్లిం దేశాల ట్రావెల్ బ్యాన్ పై ట్రంప్ స‌ర్కారు జారీ చేసిన ఉత్త‌ర్వుల్ని కింది కోర్టులు నిలిపివేస్తూ నిర్ణ‌యం తీసుకున్నాయి. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది ట్రంప్ ప్ర‌భుత్వం. ఈ వివాదాస్ప‌ద ఉత్త‌ర్వుల‌ను తిరిగి పున‌రుద్ద‌రిస్తూ సుప్రీంకోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. అదే స‌మ‌యంలో.. అమెరికాలోకి ప్ర‌వేశించేందుకు ఎవ‌రు అర్హులన్న విష‌యంలో కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల్ని నిర్దేశించింది.

కోర్టు ఉత్త‌ర్వులు వెలువ‌డిన 72 గంట‌ల అనంత‌రం నిషేధ ఉత్త‌ర్వుల‌ను అమ‌లు చేయ‌నున్న‌ట్లు ట్రంప్ ఇప్ప‌టికే వెల్ల‌డించారు. తాజా తీర్పుతో ఇరాన్‌.. లిబియా.. సోమాలియా.. సూడాన్‌.. సిరియా.. యెమెన్ దేశాల నుంచి అమెరికాకు వచ్చే పౌరుల్ని 90 రోజుల పాటు రాకుండా అడ్డుకునే వీలు ఉంటుంది. అదే స‌మ‌యంలో 120 రోజుల పాటు శ‌ర‌ణార్ధులు అమెరికాలో ప్ర‌వేశించ‌టానికి వీలు ఉండ‌దు.

తాజా ఉత్త‌ర్వులకు కొన్ని మిన‌హాయింపులు లేక‌పోలేదు. ట్రావెల్ బ్యాన్ అమ‌ల్లో ఉన్న దేశాల‌కు చెందిన పౌరులు.. అమెరికాలో నివ‌సిస్తున్నా.. లేదంటే అమెరికా సంస్థ‌ల‌తో చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన సంబంధాలు ఉంటే వారు అమెరికాలో ప్ర‌వేశించేందుకు అర్హులు. అదే స‌మ‌యంలో చెల్లుబాటు అయ్యే వీసాలు ఉన్న వారిని కూడా అనుమ‌తించాల‌ని  సుప్రీం స్ప‌ష్టం చేసింది. అమెరికా భ‌ద్ర‌తా కోణంలో సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణ‌యం త‌మ సంపూర్ణ విజ‌యంగా ట్రంప్ చెప్పుకున్నారు. ట్రావెల్ బ్యాన్ పై మొద‌ట్నించి స్ప‌ష్ట‌మైన వైఖ‌రిని ప్ర‌ద‌ర్శించిన ట్రంప్‌న‌కు సుప్రీం తాజా ఉత్త‌ర్వులు ఆయ‌న దూకుడును మ‌రింత‌ పెంచేందుకు సాయం చేస్తాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News