కిమ్‌..నాది నీకంటే పెద్ద‌ది

Update: 2018-01-03 07:36 GMT
అమెరికా - ఉత్తర కొరియా అధ్యక్షుల మధ్య మాటల యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఇద్దరు నేతలూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. నువ్వెంతంటే నువ్వెంత అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. అమెరికాపై వేయడానికి న్యూక్లియర్ బాంబు స్విచ్ తన టేబుల్‌ పైనే సిద్ధంగా ఉంటుందని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ హెచ్చరించిన విషయం తెలిసిందే. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సోమవారం ఆయన దేశప్రజలకు సందేశాన్ని ఇచ్చారు. అణుదాడికి సంబంధించిన బటన్ తన టేబుల్ మీద ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని అమెరికాను హెచ్చరిస్తూనే.. నూతన ఏడాదిలో భారీగా అణ్వాయుధాలను - ఖండాంతర క్షిపణులను తయారు చేయాలని ఉత్తరకొరియా శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు.

అయితే కిమ్ బెదిరింపున‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీటుగా సమాధానమిచ్చారు. ఉత్త‌రకొరియా కంటే పెద్ద‌దైన అణుబాంబు త‌న వ‌ద్ద ఉంద‌ని తెలిపారు. `మీ కన్నా పెద్దది - చాలా శక్తివంతమైన బాంబు నా దగ్గర ఉంది.. ఆ స్విచ్ కూడా నా టేబుల్‌ పైనే ఉంటుంది. అంతేకాదు.. అది ఫెయిలయ్యే చాన్సే లేదు` అని ట్రంప్ ట్వీట్ చేశారు. కొత్త సంవత్సరం రోజున జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు కిమ్. అమెరికా మొత్తం కవరయ్యేలా ఓ ఇంటర్‌ కాంటి నెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ తమ దగ్గర ఉన్నదని, దానికి సంబంధించిన స్విచ్ తన టేబుల్‌ పైనే ఉంటుందని కిమ్ అన్నారు.

త‌న నూత‌న సంవ‌త్స‌రం సందేశంలో కిమ్ మాట్లాడుతూ  అణ్వస్త్ర కార్యక్రమాన్ని తాను మరింత వేగవంతం చేస్తానని ప్రపంచానికి స్పష్టం చేశారు. `అణ్వస్త్ర రాజ్యంగా ఆవిర్భవించాలన్న లక్ష్యాన్ని మనం ఇప్పటికే సాధించాం. అమెరికా ప్రధాన భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని గత ఏడాది ఆయుధ కార్యక్రమాన్ని రూపొందించాం. దీంతోపాటు ఏడాది మొత్తం ఖండాంతర క్షిపణి ప్రయోగాలు విస్తృతంగా నిర్వహించాం. అమెరికా ఎటువంటి అణుదాడి చేసినా ఎదుర్కొనే సత్తా మనకుంది. మన వద్ద పటిష్ఠమైన అణ్వస్త్ర నిరోధక వ్యవస్థ ఉంది. నిప్పుతో అమెరికా చెలగాటం ఆడలేదు. అణ్వస్త్ర దాడి బటన్ ఎల్లప్పుడూ నా టేబుల్‌పైనే ఉంటుంది. ఇది ఉట్టి బెదిరింపు అని అమెరికా అనుకుంటే పొరపాటు. ఇది బెదిరింపు కాదు.. వాస్తవం` అని కిమ్ హెచ్చరించారు.

ఈ ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఐక్య‌రాజ‌స్య స‌మితి రంగంలోకి దిగి ఇరు దేశాల మ‌ధ్య స‌ఖ్య‌త కోసం ప్ర‌య‌త్నిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఐరాస ప్ర‌య‌త్నాల‌కు భంగం క‌లిగించేలా ఇరు దేశాధినేత‌లు ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం క‌ల‌క‌లంగా మారింది.
Tags:    

Similar News