ట్రంప్ ప్ర‌క‌ట‌న: చిన్న అణుబాంబులు రెడీ

Update: 2018-02-04 04:42 GMT
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అణుబాంబులు త‌యారు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అయితే అవి చిన్న‌వ‌ని తెలిపారు. అణ్వాయుధాగారాన్ని ఆధునీకరించే ఓ కొత్త విధానాన్ని ట్రంప్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ విధానం కింద అమెరికా కొత్తవి - చిన్నవి అణు బాంబులు తయారు చేయనుంది. అలాగే వాటిని నిరోధించే సామర్థ్యాన్ని కూడా పెంపొందించనుంది. 2018కి సంబంధించి అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్‌ నుంచి అణ్వాయుధ విధాన సమీక్ష (ఎన్‌ పీఆర్) విడుదలైన అనంతరం ట్రంప్ మాట్లాడుతూ 21వ శతాబ్దంలో ఎదురుకానున్న ముప్పును ఎదుర్కొనేందుకు ఇది ఎంతో అనుకూలమైన - సౌకర్యవంతమైన వ్యూహమని అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు.

తమ అణు సదుపాయాలు - ద్వంద్వ సామర్థ్యం గల వైమానిక వ్యవస్థ - త్రివిధ దళాలు - అణు ఆధిపత్యం - నియంత్రణ తదితరమైన వాటిని ఆధునీకరించే దిశగా నూతన విధానాన్ని రూపొందించామని ట్రంప్‌ చెప్పారు. అణ్వాయుధాలను సేకరించేందుకు ప్రయత్నించే ఉగ్రవాదులు లేదా ప్రభుత్వేతర సంస్థలకు సహాయపడే దేశాలను అమెరికా తీవ్రంగా హెచ్చరించింది. అణ్వాయుధాలను పొందేందుకు ప్రయత్నించే ఉగ్రవాదులకు సాయపడే ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర సంస్థలను జవాబుదారులను చేస్తామని తెలిపింది.

మ‌రోవైపు ఈ పరిణామం మ‌ళ్లీ అమెరికా అధికార‌వ‌ర్గాల్లో చీలిక‌కు కార‌ణ‌మైంది. రిపబ్లికన్ పార్టీ మెమో నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్, అమెరికాలో అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్‌ బీఐ మధ్య దూరం మరింత పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆ మెమోను ట్రంప్ అవమానకరం అని వ్యాఖ్యానించగా - తమ ఏజెంట్లకు అండగా ఉంటానని ఎఫ్‌ బీఐ చీఫ్ స్పష్టం చేశారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తు సందర్భంగా నాటి ట్రంప్ ప్రచార సలహాదారునిపై నిఘా వేసే విషయంలో అధికారులు కోర్టును తప్పుదోవ పట్టించారని రిపబ్లికన్ పార్టీ సదరు మెమోలో ఆరోపించింది. అయితే అధ్యక్షుని జాతీయ భద్రతా బృందం - ఇతర అధికారులు - నిఘా విభాగం సభ్యులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే రిపబ్లికన్లు ఆ మెమోను విడుదల చేశారని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి శారా సాండర్స్ వెల్లడించారు.
Tags:    

Similar News