కిమ్‌ పై ట్రంప్ కొర‌డా.. ఆస్తుల‌పై నిషేధం!

Update: 2017-09-07 13:30 GMT
త‌న‌ను మించిన మొగాడు, మొన‌గాడు లేడ‌ని విర్ర‌వీగుతూ ప్ర‌పంచ దేశాల‌కు స‌వాలు రువ్వుతున్న ఉత్త‌ర‌కొరియా అధ్య‌క్షుడు కిమ్‌కు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ గ‌ట్టి షాకిచ్చేదిశ‌గా పావులు క‌దుపుతున్నారు. ఎవ‌రు ఎన్నిర‌కాలుగా హిత బోధ చేసినా.. త‌న పంతం తాను నెర‌వేర్చుకుంటాన‌నే ఉద్దేశంతో ఉన్న కిమ్ గ‌త రెండు నెల‌లుగా ఉద్రిక్త‌త‌ల‌ను పెంచి పోషిస్తున్నాడు. నాలుగు రోజుల కింద‌ట హైడ్రోజ‌న్ బాంబు ప్ర‌యోగంతో ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడించారు. ఇదే గ‌నుక ప్ర‌యోగిస్తే.. ప్ర‌పంచ‌మే మ‌రో హీరోషిమా-నాగ‌సాకి అయిపోతుంద‌ని ఐక్యారాజ్య స‌మితి ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.

అయినా కూడా కిమ్ ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌క‌పోగా.. ఇవ‌న్నీ అమెరికాకు తామిచ్చే గిఫ్టులుగా పేర్కొన‌డం మ‌రింత ఆందోళ‌న క‌లిగించిన విష‌యం.  ఈ క్ర‌మంలోనే స‌మావేశ‌మైన ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తా మండ‌లి.. కిమ్ అంతు చూడాల‌ని నిర్ణ‌యించింది. ఇప్ప‌టికే ఉన్న ఎగుమ‌తులు, దిగుమ‌తుల ఆంక్ష‌ల‌కు తోడు మ‌రిన్ని ఆంక్ష‌లు విధించాల‌ని నిర్ణ‌యించింది. దీనికి సంబంధించి అమెరికా అధ్య‌క్షుడు మ‌రో అడుగు ముందుకేసి.. కిమ్‌ కు ఉన్న ఆస్తులన్నింటినీ స్తంభింపజేయాలని తాజాగా  ప్రతిపాదించారు. ఈ ముసాయిదాను భద్రతా మండలి సభ్య దేశాల‌కు అమెరికా పంచింది.

ఈ ముసాయిదాలో కిమ్ ఆస్తుల‌తో పాటు కొరియాకు ఇంధన ఉత్పత్తుల సరఫరాను పూర్తిగా నిలిపివేయాలని, ఆ దేశ వస్త్ర పరిశ్రమ ఎగుమతులను నిషేధించాలని ట్రంప్ ప్రతిపాదించారు. కిమ్‌ జాంగ్‌ ఉన్‌ - కొరియా ప్రభుత్వ ఆస్తులను స్తంభింపజేయాలని, ఆ దేశ అధికారుల విదేశీ పర్యటనలను నిషేధించాలని సూచించారు. కొరియా కార్మికులు విదేశాల్లో పనిచేయకుండా నిషేధించాలని ట్రంప్‌ పేర్కొన్నారు.  నిజానికి ఇప్ప‌టికే ఉత్త‌ర‌కొరియాపై అనేక ఆంక్ష‌లు ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో ఇలాంటి అత్యంత కీల‌క‌మైన‌, ప్ర‌జ‌ల మ‌నుగ‌డ‌కు అవ‌స‌ర‌మైన వాటిపై ఆంక్ష‌లు విధిస్తే.. జీవించే హ‌క్కును, మాన‌వ హ‌క్కును ప్ర‌భావితం చేయ‌డ‌మేన‌ని హ‌క్కుల నేత‌లు అప్పుడే ప్ర‌శ్న‌లు మొద‌లు పెట్టారు. ముఖ్యంగా ఉత్త‌ర‌కొరియాకు మిత్ర దేశాలుగా ఉన్న చైనా, ర‌ష్యాలు కూడా ఇలాంటి ఆంక్ష‌ల‌ను స‌హించ‌వు. ముఖ్యంగా భ‌ద్ర‌తా మండ‌లి కిమ్ ముసాయిదాను ఆమోదించాలంటే.. ఈ రెండు దేశాల ఆమోదం త‌ప్ప‌నిస‌రి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ట్రంప్ ప్ర‌య‌త్నం విఫ‌ల‌మ‌వుతుందా అనేది వేచి చూడాలి.
Tags:    

Similar News