ఆ ముస్లిం అమెరికాకు రావొచ్చంటున్న ట్రంప్

Update: 2016-05-10 09:46 GMT
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగాలని తహతహలాడే బిజినెస్ మాగ్నెట్ డోనాల్డ్ ట్రంప్ నోరు ఎంత కంపుగా ఉంటుందో అందరికి తెలిసిందే. ఏ విషయం మీదనైనా సరే వివాదాస్పదంగా మాట్లాడటం ఆయనకే చెల్లుతుంది. ఇన్ని దుర్గ్మాణాలు ఉన్నప్పటికీ ఒక్క విషయంలో మాత్రం ట్రంప్ ను మెచ్చుకోవాలి. చాలామంది నేతలు లోపల ఒకరకంగా.. బయటకు మరోలా మాట్లాడే మాటలకు భిన్నంగా ఉన్నది ఉన్నట్లుగా కుండబద్ధలు కొట్టటం ఆయనకు అలవాటు.

ప్రపంచంలో చాలా దేశాల్లోని నేతలు మైనార్టీల మీద ఉన్న అక్కసును బయటపెట్టేందుకు ఇష్టపడరు. అదే విధంగా ఒక వర్గం మీద తమకున్న ఆగ్రహాన్ని వెల్లడించకుండా.. తమ చేతలతో ఏం చేయాలో అది చేస్తుంటారు. కానీ.. ట్రంప్ దీనికి భిన్నం. ముస్లింల మీద తనకున్న ఆగ్రహాన్ని ఆయన ఎప్పుడూ దాచుకున్నది లేదు. తాను కానీ అమెరికా అధ్యక్షుడిని అయితే ముస్లింలను అమెరికాలోకి అడుగుపెట్టనీయనని తేల్చేసి సంచలనంసృష్టించారు.

ఈ వ్యాఖ్య మీద బోలెడన్ని విమర్శలు వెల్లువెత్తినా ఆయన మాత్రం వెనక్కి తగ్గలేదు. తాజాగా లండన్ మేయర్ గా సాదిక్ ఖాన్ అనే పాక్ మూలాలున్న ముస్లిం పదవీ బాధ్యతలు చేపట్టటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ దగ్గర లండన్ మేయర్ గురించి ప్రస్తావించింది మీడియా. లండన్ మేయర్ కానీ అమెరికాకు రావాల్సి వస్తే ఏం చేస్తారంటూ తనకు ఎదురైన ప్రశ్నకు స్పందించిన ట్రంప్.. సాదిక్ లండన్ మేయర్ గా ఎన్నిక కావటం సంతోషమని.. ప్రతి నిబంధనకు ఒక మినహాయింపు ఉంటుందని.. తన మాటకు మినహాయింపు ఉంటుందన్న ఆయన.. సాదిక్ ను అమెరికాకు రావటానికి మినహాయింపు ఇస్తామన్నారు. తన తాజా ప్రకటనతో ముస్లింలంటే తనకు వ్యతిరేకత లేదని.. ప్రవర్తన ఆధారంగానే కొందరు ముస్లింలను తాను వ్యతిరేకిస్తున్న భావన కలిగేలా ట్రంప్ వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.
Tags:    

Similar News