సేమ్ సీన్ రిపీట్స్‌!..అవిశ్వాసం చ‌ర్చ‌కు రాలే!

Update: 2018-03-20 09:34 GMT
ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌ని న‌రేంద్ర మోదీ స‌ర్కారుపై ఏపీకి చెందిన విప‌క్ష వైసీపీ - అధికార పార్టీ టీడీపీ వేర్వేరుగా ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలు నేడు కూడా చ‌ర్చ‌కు రాకుండానే పోయాయి. నిన్న‌టి మాదిరిగానే నేడు కూడా పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లో అవిశ్వాస తీర్మానాలు చ‌ర్చ‌కు రావాలంటే స‌భ స‌జావుగా ఉండాల‌ని, లేని ప‌క్షంలో స‌భ‌ను వాయిదా వేయ‌డం మిన‌హా మ‌రేమీ చేయ‌లేమ‌ని నిన్న‌టి ప్ర‌క‌ట‌న‌నే వ‌ల్లె వేసిన లోక్ స‌భ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్‌... నిన్న‌టి మాదిరే నేడు కూడా స‌భ‌ను రేప‌టికి వాయిదా వేసేశారు. అటు రాజ్య‌స‌భ‌లోనూ నిన్న జ‌రిగిన ప‌రిణామాలో మ‌రోమారు రిపీట్ అయ్యాయి. మొత్తంగా వ‌రుస‌గా రెండో రోజు కూడా ఏపీకి చెందిన పార్టీలు ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానాలు చ‌ర్చ‌కు రాకుండానే ఉభ‌య స‌భ‌లు వాయిదా ప‌డిపోయాయి.

ఇదిలా ఉంటే... నిన్న‌టి స‌మావేశాల్లో అవిశ్వాస తీర్మానాలు చ‌ర్చ‌కు రాకుండా అడ్డుకున్న పార్టీలే నేడు కూడా అడ్డంగా నిల‌బడిపోయాయి. కావేరీ న‌దీ జ‌లాల వివాద ప‌రిష్కారం కోసం బోర్డును ఏర్పాటు చేయాలంటూ త‌మిళ‌నాడు అధికార పార్టీ అన్నాడీఎంకే - ముస్లిం రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి సానుకూల నిర్ణ‌యం ప్ర‌క‌టించాల‌ని తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌ కు చెందిన ఎంపీలు ఉభ‌య‌స‌భ‌ల్లో పెద్ద ఎత్తున నిర‌స‌న తెలిపారు. నిన్న‌టి మాదిరే నేడు కూడా స‌భ ప్రారంభం కాగానే వెల్ లోకి దూసుకెళ్లిన ఆ రెండు పార్టీల ఎంపీలు... స‌భ‌లో గంద‌ర‌గోళ ప‌రిస్థితుల‌కు కార‌ణ‌మ‌య్యారు. ప్లకార్డులు ప‌ట్టుకోవ‌డంతో పాటుగా పెద్ద పెట్టున నినాదాలు చేసిన ఆ రెండు పార్టీల ఎంపీలు స‌భ‌లో ర‌ణ‌రంగాన్నే సృష్టించారు. ఈ క్ర‌మంలో అవిశ్వాస తీర్మానాలను ప్ర‌స్తావించిన లోక్ స‌భ స్పీక‌ర్‌... స‌భ స‌జావుగా ఉంటేనే వాటిపై చ‌ర్చ‌కు అనుమ‌తిస్తామ‌ని స‌భ్యుల‌కు విన్న‌వించారు.

అయితే అన్నాడీఎంకే - టీఆర్ ఎస్ ఎంపీలు ఏమాత్రం వెన‌క్కు త‌గ్గ‌లేదు. దీంతో ప్రారంభ‌మైన వెంట‌నే స‌భ‌ను మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు వాయిదా వేసిన సుమిత్రా మ‌హాజ‌న్‌... స‌భ తిరిగి ప్రారంభ‌మైనా స‌భ్యుల నిర‌స‌న‌లు కొన‌సాగ‌డంతో స‌భ‌ను రేప‌టికి వాయిదా వేశారు. అదే స‌మ‌యంలో ఇరాక్‌ లో తీవ్ర‌వాదుల చెర‌కు చిక్కి మృత్యువాత ప‌డ్డ 39 మంది భార‌తీయుల విషాదాంతాన్ని ప్రక‌టించేందుకు స‌భ‌కు వ‌చ్చిన సుష్మా స్వ‌రాజ్‌ ను కూడా ఆ రెండు పార్టీలు ఎంపీలు అడ్డుకున్నారు. ఈ క్ర‌మంలో వారిపై స్పీకర్ త‌న‌దైన శైలిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయినా ప‌రిస్థితి అదుపులోకి రాక‌పోవ‌డంతో స‌భ్యుల నిర‌స‌న‌ల మ‌ధ్యే సుష్మా స్వ‌రాజ్ ప్ర‌కట‌న చేయ‌గా... ఆ వెంట‌నే స‌భ‌ను స్పీక‌ర్ రేప‌టికి వాయిదా వేశారు. ఇక రాజ్య‌స‌భ‌లోనూ దాదాపుగా ఇదే త‌ర‌హా ప‌రిస్థితులు నెల‌కొన‌డంతో రాజ్య‌స‌భ చైర్మ‌న్ స‌భ‌ను రేప‌టికి వాయిదా వేశారు. మొత్తంగా టీఆర్ ఎస్‌ - అన్నాడీఎంకే స‌భ్యుల నిర‌స‌న‌ల కార‌ణంగా ఏపీకి చెందిన పార్టీలు ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానాలు వ‌రుస‌గా రెండో రోజు కూడా చ‌ర్చ‌కు రాకుండాపోయాయి.
Tags:    

Similar News