ఏపీ ఎమ్మెల్సీలో బాబు బ్యాచ్ బోణీ కొట్టింది

Update: 2017-03-02 05:45 GMT
ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ఫలితం తేలిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార టీడీపీకి చెందిన బీఎన్ రాజసింహులు.. అలియాస్ దొరబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో.. ఎమ్మెల్సీల ఎన్నికల్లో టీడీపీ తన ఖాతాను ఓపెన్ చేసినట్లైంది. చిత్తూరు జిల్లా స్థానిక సంస్థలకు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తంగా ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి.

అధికారపక్షం తరఫున దొరబాబు నామినేషన్ వేయగా.. ప్రధాన ప్రతిపక్షానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం లేని కారణంగా ఆ పార్టీ తరఫు నుంచి బరిలోకి దిగలేదు. టీడీపీ అభ్యర్థి కాకుండా మరో నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల గడువు పూర్తి అయ్యే సమయానికి రెండు నామినేషన్లు పోటీ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకోగా.. మరో రెండు నామినేషన్లను అధికారుల పరిశీలనలో సరిగా లేవని తిరస్కరించారు.

దీంతో.. దొరబాబు ఏకగ్రీవం అయ్యారు. అయితే.. ఈ ఎన్నికను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. మరోవైపు తూర్పుగోదావరిజిల్లాకు చెందిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ దాదాపు చిత్తూరు సీనే రిపీట్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎందుకంటే.. ఇక్కడ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగలేదు.

అధికార టీడీపీ అభ్యర్థి చిక్కాల రామచంద్రరావు నామినేషన్లు దాఖలుచేయగా.. స్వతంత్ర అభ్యర్థులుగా ఐదుగురు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో నలుగురి నామినేషన్లను అధికారులు తిరస్కరించగా.. మరో  స్వతంత్ర అభ్యర్థి మాత్రం బరిలో ఉన్నారు. ఈ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు అధికారపక్షం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి తన నామినేషన్ ను ఉపసంహరించుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ.. నామినేషన్ ఉపసంహరణ జరిగితే.. చిత్తూరు మాదిరే తూర్పుగోదావరి ఎమ్మెల్సీ ఎన్నిక కూడా ఏకగ్రీవం అయినట్లే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News