ప్ర‌మాదంపై స‌మాధానం లేని ప్ర‌శ్న‌లెన్నో?

Update: 2017-03-01 10:40 GMT
కృష్ణా జిల్లా నందిగామ స‌మీపంలో నిన్న తెల్ల‌వారుజామున జ‌రిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదం క్ర‌మంగా రాజ‌కీయ రంగు పులుముకుంది. ప‌ది మంది ప్రాణాల‌ను హ‌రించేసిన ఆ ప్ర‌మాదం... 30 మందికి పైగా ప్ర‌యాణికుల‌ను క్ష‌త‌గాత్రుల‌ను చేసింది.ఇంత భారీ న‌ష్టానికి కార‌ణ‌మైన ప్ర‌మాదంపై ప్ర‌భుత్వం సాధార‌ణంగా వేగంగా స్పందించాలి. కాని అందుకు విరుద్ధంగా చంద్ర‌బాబు స‌ర్కారు ఈ వ్య‌వ‌హారంలో నాన్చుడు ధోర‌ణితో ముందుకుపోతున్న‌ట్లు క‌నిపిస్తోంది. నిన్న ఉద‌యం ప్ర‌మాదంపై స‌మాచారం అందుకున్న వెంట‌నే హైద‌రాబాదు నుంచి బ‌య‌లుదేరిన విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దాదాపు 250 కిలో మీట‌ర్ల‌కు పైగా దూరంలో ఉన్న నందిగామ‌కు వెళ్లారు. అయితే అక్క‌డికి కేవ‌లం 20 కిలో మీట‌ర్ల దూరంలోని వెల‌గ‌పూడి తాత్కాలిక స‌చివాల‌యంలో ఉన్న మంత్రులు, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అస‌లు ఆ వైపుగా దృష్టి సారించిన పాపాన పోలేదంటే ఆశ్చ‌ర్యం వేయ‌క మాన‌దు.

జ‌గ‌న్ నందిగామ వెళ్లిన స‌మాచారం తెలుసుకున్న త‌ర్వాత వైద్య‌ - ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న కామినేని శ్రీనివాస్ ప‌రుగు ప‌రుగున అక్క‌డికి వెళ్లారు. కామినేని మిన‌హా ప్ర‌మాద బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన మంత్రి మ‌రొక్క‌రు కూడా లేరు. చంద్ర‌బాబు అయితే ఈ ప్ర‌మాదంపై క‌నీసం స‌మీక్ష చేసిన దాఖ‌లా కూడా లేదు. ఇక రోడ్డు ప్ర‌మాదాల‌కు చెక్ పెడ‌తామంటూ నిత్యం ప్ర‌క‌టన‌లిస్తూ ఊద‌ర‌గొడుతున్న ర‌వాణా శాఖ మంత్రి శిద్ధా రాఘ‌వ‌రావు కూడా ప్ర‌మాదం జ‌రిగిన స్థ‌లాన్ని కూడా సంద‌ర్శించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ ప్ర‌మాదానికి సంబంధించి విప‌క్ష వైసీపీతో పాటు ప్ర‌మాద బాధితులు, ఇత‌ర వ‌ర్గాల నుంచి వెల్లువెత్తుతున్న ప్ర‌శ్న‌ల‌కు అస‌లు ప్ర‌భుత్వం వ‌ద్ద స‌మాధానం ఉందా? అన్న వాద‌న కూడా వినిపిస్తోంది. పెను రాజ‌కీయ ప్ర‌కంప‌న‌ల‌కే కేంద్రంగా మారిన ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టిదాకా వెలుగులోకి వ‌చ్చిన ప్ర‌శ్న‌ల‌ను ఓ సారి ప‌రిశీలిద్దాం.

* ప్ర‌మాదానికి ప్ర‌ధాన కారకుడిగా భావిస్తున్న డ్రైవ‌ర్ ఆదినారాయ‌ణ మృత‌దేహానికి పోస్టు మార్ట‌మ్ ఎందుకు నిర్వ‌హించ‌లేదు?

* 10 మంది ప్రాణాల‌ను బ‌లిగొన్న ప్ర‌మాద స్థ‌లి 20 కిలో మీట‌ర్ల దూరంలోనే ఉన్నా మంత్రులు అక్క‌డికి ఎందుకు వెళ్లలేదు?

* ఆసుప‌త్రిలో చేరిన బ‌స్సు రెండో డ్రైవ‌ర్ కృష్ణా రెడ్డి ఉన్న‌ట్టుండి మాయ‌మై... జ‌గ‌న్ ప్ర‌శ్నించ‌గానే మ‌ళ్లీ ఎందుకు ప్ర‌త్య‌క్ష‌మయ్యాడు?

* బ‌స్సు య‌జ‌మానిగా ఉన్న దివాక‌ర్ ట్రావెల్స్‌పై ఇప్ప‌టిదాకా కేసు ఎందుకు న‌మోదు చేయ‌లేదు?

* విప‌క్ష నేత హోదాలో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అడిగినా.. పోస్టుమార్ట‌మ్ కాపీల‌ను ఆయ‌న‌కు ఎందుకు ఇవ్వ‌లేదు?

* ఆదినారాయ‌ణ మృత‌దేహానికి పోస్టుమార్ట‌మ్ చేయ‌లేద‌ని వైద్యులు చెబితే... ఆ మాట మార్చేందుకు క‌లెక్ట‌ర్ ఎందుకు య‌త్నించారు?

*  జ‌గ‌న్‌పై కేసు పెట్టిన ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్ ఓ కార‌ణం చెబితే... ఆసుప‌త్రి అభివృద్ధి క‌మిటీ చైర్మ‌న్ హోదాలో రంగంలోకి దిగిన టీడీపీ నేత వాసిరెడ్డి స‌త్య‌నాయ‌ణ ప్ర‌సాద్ ఇంకో కార‌ణం ఎందుకు చెప్పారు?

* జ‌గ‌న్ విధుల‌కు అడ్డంగా నిలిచిన వైనం నేటి ఉద‌యం దాకా వైద్యుల‌కు ఎందుకు గుర్తుకు రాలేదు?

* ఓ వైపు ప్ర‌మాదంలో త‌మ వారు చ‌నిపోయి ప‌ది కుటుంబాలు తీర‌ని వేద‌న‌లో ఉంటే... వారికి భ‌రోసా క‌లిగించాల్సిన ప్ర‌భుత్వం విప‌క్షంపై దాడి ఎందుకు మొద‌లెట్టిన‌ట్లు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News