స్టేజీ 2 నుంచి స్టేజీ 3కి: ఎయిమ్స్‌ డైరెక్టర్‌ కీలక ప్రకటన

Update: 2020-04-06 16:00 GMT
లాక్‌ డౌన్ విధించినా కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో దేశంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. లాక్‌ డౌన్‌ విధించి దాదాపు 13 రోజులు పూర్తయ్యాయి. అయితే దేశంలో కరోనా ఏ స్టేజీలో ఉందనే చర్చ ఆసక్తికరంగా మారింది. వాస్తవంగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే క్రమంలో మొత్తం మూడు దశలు ఉంటాయి. మొదటి దశ అంటే ఒకరి ద్వారా మరొకరికి సోకడం. ఆ తర్వాత ఆ సోకిన వారి నుంచి వారి కుటుంబసభ్యులకు సోకడం రెండో దశ. ఆ తర్వాత ఆ సోకిన వారి నుంచి వారికి సంబంధం లేని వారికి ఈ వైరస్‌ సోకడం చివరి దశ. ఈ దశకు చేరితే మాత్రం దేశంలో అత్యధికంగా కరోనా కేసులు పెరిగి.. కోట్ల మందికి వ్యాపించే ప్రమాదం ఉంది. అయితే ప్రస్తుతం భారతదేశంలో ఆ స్టేజీలో ఉన్న విషయాన్ని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా కీలక ప్రకటన చేశారు.

ప్రస్తుతం దేశంలో వైరస్ ‍వ్యాప్తి అనేది స్టేజీ 2 నుంచి స్టేజీ 3 మధ్య ఉందని సంచలన ప్రకటన చేశారు. దేశంలో కరోనా వైరస్ క్రమంగా స్టేజీ 2 నుంచి మూడో దశకు చేరుకుందని ఆయన చెబుతున్నారు. అయితే దీనికి ప్రధాన కారణం కూడా తెలిపారు. అదే భౌతిక దూరం పాటించకపోవడమేనని పేర్కొన్నారు. ఒకరి నుంచి మరొకరు కొంత దూరం పాటిస్తే వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం తక్కువగా ఉందని వెల్లడించారు.

అయితే భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో స్టేజీ 2 ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో స్టేజీ 3కి చేరిందని వివరించారు. వైరస్ సోకిన వారు ఆయా ప్రాంతాల్లో సంచరించడంతో వ్యాధి ప్రబలుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో స్టేజీ 3కి చేరిన కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. స్టేజీ 3కి వైరస్ వ్యాప్తి చేరితే ఆ కరోనాను కట్టడి చేయడం చాలా కష్టం. ఈ దశలో ఉండడంతో ప్రజలు భౌతిక దూరం ప్రకటించాలని చెబుతున్నారు. అందుకే ప్రజలు ఇళ్లల్లోనే ఉండి లాక్‌ డౌన్‌ కు సంపూర్ణంగా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ - తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఇస్తున్న సూచనలు - సలహాలు పాటించాలని సూచిస్తున్నారు.


Tags:    

Similar News