రెండో డోసు టీకా పని చేసేది ఆర్నెల్లు మాత్రమేనా?

Update: 2021-09-12 05:16 GMT
డాక్టర్ శ్రీధర్ చిలిమూరి పేరును గతంలో ఎప్పుడూ వినలేదనే చెప్పాలి. అలాంటి ఆయన తాజాగా  చెబుతున్న మాటలకు తప్పనిసరిగా వినాల్సిన పరిస్థితి. ఎందుకంటే.. కరోనా మహమ్మారి మీద ఆయనకున్న అనుభవం అలాంటిది. అమెరికాలో ఉండే ఈ తెలుగు వైద్యుడు న్యూయార్కులోని బ్రాంక్స్ కేర్ హాస్పిటల్ లో డిపార్టుమెంట్ ఆఫ్ మెడిసిన్ కు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.

ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివి.. అమెరికాకు వెళ్లిన ఆయన ఇటీవల కాలంలో కొవిడ్ 19 మీద ఏకంగా 15కు పైగా వ్యాసాలు రాశారు. ఆయన రాసిన ఆర్టికల్స్ ను అమెరికాలోని పలు జర్నల్స్ పబ్లిష్ చేశాయి. అలాంటి ఆయన తాజాగా ఒక తెలుగు మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా కొవిడ్ 19 మీదా.. వ్యాక్సిన్ మీద పలు అంశాల్ని ప్రస్తావించారు. ఆయన చెప్పిన ముఖ్యాంశాలు.. ఆయన అనుభవాల గురించి చూస్తే..

వ్యాక్సినేషన్ ఎక్కువగా జరిగితే.. కేసుల్ని తగ్గించే అవకాశం ఉందా? అన్న ప్రశ్న చాలామందికి వస్తుంటుంది? అమెరికాలో భారీ ఎత్తున వ్యాక్సినేషన్ జరిగింది కదా? మరి అలాంటి దేశంలో ఎక్కువ కేసులు ఎందుకు నమోదవుతున్నాయి? అన్న మరో ప్రశ్నకు శ్రీధర్ సమాధానం ఇచ్చారు. ఆయనేం చెప్పారో ఆయన మాటల్లోనే చూస్తే.. ‘‘న్యూయార్క్ లో 65 శాతం మందికి టీకా పంపిణీ జరిగింది. దీంతో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కేసులు తక్కువ. ఫ్లోరిడా.. టెక్సాస్ లో 50శాతం కంటే తక్కువగానే వ్యాక్సిన్లు ఇచ్చారు. అక్కడ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఆఫ్రికన్ అమెరికన్లు టీకా తీసుకోవటానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే.. తాము ఆరోగ్యవంతులమన్నది వారి భావన.

అయితే.. వారిలో చాలామందికి బీపీ.. ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఇలాంటివారే వైరస్ బారిన పడుతన్నారు. అమెరికాలో తొలి డోసు ఇచ్చిన నాలుగు వారాల తర్వాత రెండో డోస్ ఇచ్చారు. జనవరిలో టీకా పొందిన వారిలో కొందరు ఇప్పుడు వైరస్ బారిన పడుతున్నారు. యూకేలో తొలి డోస్ కు.. రెండో డోస్ కు మధ్య 8 నుంచి 12 వారాల విరామాన్ని ఇస్తున్నారు. భారత్ లోనూ ఇదే తీరును ఫాలో అవుతున్నారు. ఇంకేం చెప్పారంటే..

-  మూడో దశ మీద కచ్ఛితమైన ఆధారాలు లేవు.

-  భారత్ లో టీకా పంపిణీ బాగుంది.

- ఒక డోస్ పొందిన వారి నుంచి వైరస్ మరొకరికి వ్యాపించదు.

- 18 ఏళ్ల లోపు వారికి టీకా ఇవ్వని కారణంగా వీరికి పెద్ద ఎత్తున పాజిటివ్ అయ్యే ప్రమాదం ఉంది

-  2024 నాటికి కరోనా వైరస్ ప్రభావం తగ్గే వీలుంది. మాస్కులు ధరించటం.. భౌతిక దూరం పాటించటం లాంటివి మనం సరిగా చేయటం లేదు. అందుకే కొత్తగా వచ్చే టీకాలు.. ఇతర పరిస్థితుల్ని చూస్తే.. 2024 కు కానీ కరోనా ప్రభావం అంతగా ఉండని పరిస్థితి.

-  కేరళలో ఎక్కువ కేసులు పెరగటానికి కారణం అక్కడ పెద్ద ఎత్తున పరీక్షలు చేయటమే. స్వల్ప లక్షణాలు ఉన్న వారినీ పరీక్షల ద్వారా గుర్తిస్తున్నారు. ఈ పరీక్షల్లో రోగ లక్షణాలు లేని వారిలోనూ వైరస్ ను గుర్తించటం కూడా ఒక కారణం.

- మాస్కులు ధరించనంత కాలం.. భౌతికదూరం పాటించనంత కాలం.. వైరస్ వ్యాప్తి జరుగుతూనే ఉంటుంది. లక్షణాల లేకుండా కొవిడ్ వచ్చిన బాధితుల నుంచి వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటోంది.

-  సాధారణ వ్యక్తులు రెండో డోసు పొందిన ఆర్నెల్ల తర్వాత మూడో డోస్ (బూస్టర్) పొందితే మంచిది.

-  బూస్టర్ డోస్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవు. రెండో డోసు పొందిన ఆరు నెలల తర్వాత మూడో డోస్ పొందితే మంచిది.

-  రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారు.. పెద్ద వయస్కుల వారికి మూడో డోసు ఇస్తే.. థర్డ్ వేవ్ వచ్చినా.. కొత్త మ్యూటెంట్లు వచ్చినా ఎదుర్కోవటానికి అవసరమైన రోగ నిరోధక శక్తి వచ్చే వీలుంది.

- టీకా తీసుకున్న వారు వైరస్ బారిన పడుతుంటే.. మూడో డోసు మీద ఫోకస్ చేయాలి. ఇందుకు భారత్ సన్నద్ధం కావాలంటే టీకా కార్యక్రమాన్ని మరింత వేగంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఇజ్రాయెల్ లో మూడో డోసు ఇవ్వటం వల్ల మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. టీకా తీసుకున్న తర్వాత ఏమీ కాదన్న ధీమా సరికాదు. జులైలో కాలిఫోర్నియాలో ఆంక్షలు తగ్గించగానే.. కేసులు పెరిగాయి.

-  అందరికీ రోగ నిరోధకశక్తి రావాలంటే.. ఎంతమందికి యాంటీబాడీలు వస్తే మంచిదన్న వాదనలో పస లేదు. అమెరికాలో చేసిన అధ్యయనాల్లో 83 శాతం మందిలో యాంటీ బాడీలు డెవలప్ అయ్యాయి. అయినా పాజిటివ్ కేసులు వస్తూనే ఉన్నాయి. కొత్త మ్యూటెంట్లు వస్తున్నంత కాలం హెర్డ్ ఇమ్యునిటీ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు.
Tags:    

Similar News