బెంగ‌ళూరు నుర‌గ సైతాన్‌..హైద‌రాబాద్‌ లోనూ!

Update: 2017-08-27 06:34 GMT
పాల‌కుల త‌ప్పులు ప్ర‌జ‌లకు శాపాలుగా మారుతున్నాయి. అధికారుల నిర్ల‌క్ష్యం.. పాల‌కుల ప‌ట్టించుకోని వైనం వెర‌సి.. కాలుష్య‌భూతం ప్ర‌జ‌ల ఆరోగ్యం మీద పెను ప్ర‌భావాన్ని చూపేలా మారుతోంది. హైద‌రాబాద్‌ ను వ‌ర‌ల్డ్ క్లాస్ సిటీగా అభివ‌ర్ణిస్తూ.. విశ్వ‌న‌గ‌రంగా మారుస్తున్నామ‌ని గొప్ప‌లు చెప్పే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట‌ల్ని గేలి చేసే దృశ్యాలు ఇప్పుడు మీడియాలోకి వ‌చ్చేస్తున్నాయి.

కొద్ది రోజుల క్రితం బెంగ‌ళూరులోని ఫార్మా.. ర‌సాయ‌న ప‌రిశ్ర‌మ‌ల వ్య‌ర్థాలు కాలుష్యంగా మారి.. నుర‌గ రూపంలో రోడ్ల మీద‌కు రావ‌టం.. అందుకు సంబంధించిన ఫోటోలు జాతీయ‌స్థాయిలో ప్ర‌ముఖంగా వ‌చ్చి గార్డెన్ సిటీ ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేశాయి.

తాజాగా ఇలాంటి నుర‌గ సైతాన్ హైద‌రాబాద్ లోనూ ద‌ర్శ‌న‌మిచ్చింది. ఇబ్ర‌హీం చెరువు.. ప‌టేల్ చెరువు.. న‌ల్ల చెరువ‌.. నాచారం చెరువు.. ముకిడి చెరువుతో పాటు తాజాగా కుక‌ట్ ప‌ల్లి ధ‌ర‌ణి కాల‌నీలోని పెరికి చెరువులోకి విడిచి పెట్టిన ర‌సాయ‌న వ్య‌ర్థాలు సామాన్య జ‌నం మీద‌కు నుర‌గ‌రూపంలో విషం చిమ్మి భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసింది.

ప‌రిశ్ర‌మ‌ల నుంచి ప్ర‌మాద‌క‌ర‌మైన వ్య‌ర్థాలు చెరువులు.. కుంట‌ల్లో క‌లుస్తున్న ర‌సాయ‌నిక వ్య‌ర్థాలు నుర‌గ రూపంలోకి మారి చెరువు మీద‌నుంచి ఇళ్ల‌ల్లోకి దూసుకొస్తోంది. చెరువు ప‌రిస‌రాల‌తో పాటు చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్ని ద‌ట్టంగా క‌మ్మేస్తున్న ఈ నుర‌గ‌తో అక్క‌డి స్థానికులు భ‌య‌భ్రాంతుల‌కు గురి అవుతున్నారు.  ఈ నుర‌గ కార‌ణంగా అనారోగ్యం విరుచుకుప‌డ‌టం ఖాయ‌మ‌ని నిపుణులు చెబుతుంటే.. కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి అధికారులు మాత్రం అది కాలుష్య నుర‌గ కానే కాదు.. స‌బ్బు నుర‌గ అంటూ తీసిపారేస్తున్న తీరు సామాన్యులకు షాకింగ్ గా మారింది.

ఒక‌వేళ అధికారులు చెబుతున్న‌ట్లు చెరువు మీద నుంచి భారీగా వ‌స్తున్న నుర‌గ ఒక‌వేళ స‌బ్బుదే అయితే.. దీని కార‌ణంగా క‌ళ్లు మంట‌లు.. చ‌ర్మం మీద ద‌ద్దుర్లు.. కిలోమీట‌ర్ల కొద్దీ దుర్వాస‌న ఎందుకు వ‌స్తున్న‌ట్లు అంటూ స్థానికులు అడుగుతున్న ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి. మ‌రి.. ఈ కాలుష్య భూతాన్ని కేసీఆర్ లాంటి స‌మ‌ర్థుడైన పాల‌కులు కూడా ఎందుకు చెక్ చెప్ప‌లేక‌పోతున్నారు? వ‌ర‌ల్డ్ క్లాస్ సిటీగా మాట‌ల్లో గొప్ప‌లు చెబితే స‌రిపోతుందా? అప్ప‌ట్లో నిజాం హ‌యాంలో చెరువులు ఎంత శుద్ధంగా ఉండేవో తెలుసా అంటూ పొగిడేసే కేసీఆర్‌.. త‌న హ‌యాంలో చెరువుల‌కు ప‌ట్టిన గ‌తి గురించి కాస్త ఆలోచిస్తే మంచిది. లేదంటే.. చ‌రిత్ర‌లో ఆయ‌న పాల‌న కాలుష్యానికి కేరాఫ్ అడ్ర‌స్ గా మార్చింద‌న్న చెడ్డ పేరు మూట క‌ట్టుకునేలా చేస్తుంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.
Tags:    

Similar News