ఆ పుకారుతో రైల్వే స్టేష‌న్ లో తొక్కిస‌లాట‌!

Update: 2018-05-28 06:26 GMT
జ‌న బాహుళ్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో చిన్న వ‌దంతి వ్యాపించినా తొక్కిస‌లాట జ‌ర‌గ‌డం....ఆ ఘ‌ట‌న‌లో వంద‌ల‌మంది గాయాల‌పాల‌వ‌డం గురించి వింటూనే ఉన్నాం. త‌మ ప్రాణాల‌ను కాపాడుకోవాల‌నే ఆతృతలో  ...ఆ వ‌దంతి నిజ‌మా.....అబ‌ద్ధ‌మా అని తేల్చుకొని విచ‌క్ష‌ణ‌తో నిర్ణ‌యం తీసుకోవ‌డం చాలా సంద‌ర్భాల్లో సాధ్యం కాక‌పోవ‌చ్చు. గత ఏడాది సెప్టెంబ‌ర్ లో ముంబైలోని ఎల్ఫిన్ స్టోన్ రైల్వే స్టేష‌న్ లో తొక్కిస‌లాట ఘ‌ట‌న  దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. ఒక వ‌దంతి వ్యాపించి జ‌రిగిన తొక్కిస‌లాట‌ ఘ‌ట‌న‌లో 23మంది మృతి చెంద‌గా 38 మంది గాయ‌ప‌డ్డారు. `ఫూల్ గిర్ గ‌యా హై(పూలు ప‌డిపోతున్నాయి)`అని ఓ ప్ర‌యాణికుడు పెట్టిన‌ కేక‌ల‌ను.....`పుల్ గిర్ గ‌యా హై(కాలిబాట వంతెన ప‌డిపోతోంది)`గా భావించిన ప్ర‌యాణికులు ఆందోళ‌న‌కు గుర‌వ‌డంతో ఈ ఘోర ప్ర‌మాదం సంభవించింది. తాజాగా, బీహార్ లోని బీహార్ షరీఫ్ రైల్వే స్టేషన్ లో ఇదే త‌ర‌హా ఘ‌ట‌న జ‌ర‌గ‌డం దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. అయితే, ఈ ఘ‌ట‌న‌లో ప్ర‌స్తుతానికి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌లేదు.

బీహార్ లోని బీహార్ షరీఫ్ రైల్వే స్టేషన్ లో ఘోర ప్ర‌మాదం సంభ‌వించింది. అక్క‌డ భూకంపం సంభ‌వించ‌బోతోంద‌న్న వదంతులు వ్యాపించడంతో తొక్కిసలాట జ‌రిగింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో దాదాపు 100 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఐఐటీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసేందుకు దాదాపు 6 వేల మంది విద్యార్థులు రైల్వే స్టేషన్ లో వేచి ఉన్న సమయంలో ఈ వ‌దంతి వ్యాపించ‌డంతో ప్ర‌మాదం జ‌రిగింది. భూకంపం రాబోతోందంటూ  ఓ విద్యార్థి అరుస్తూ పరుగులు తీయ‌డంతో మిగ‌తా విద్యార్థులు కూడా స్టేష‌న్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లేందుకు ప‌రుగులు తీశారు. ఈ క్ర‌మంలో తొక్కిసలాట జర‌గ‌డంతో దాదాపు 100 మంది విద్యార్థులు గాయ‌ప‌డ్డారు. వారిలో 58 మంది పరిస్థితి విషమంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. క్ష‌త‌గాత్రుల‌కు సమీప ఆసుప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు. స్వల్ప గాయాలైన వారికి చికిత్స చేసి ఇళ్ల‌కు పంపించామని అధికారులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై రైల్వే శాఖ అధికారులు విచార‌ణ చేప‌ట్టారు.

Tags:    

Similar News