మద్యం ఎక్కువ తాగేందుకు ఏదైనా ప్లాన్ చెప్పండి ప్లీజ్

Update: 2022-08-19 07:35 GMT
కరోనా కల్లోలంతో కుదేలైన ప్రభుత్వాలకు ఇప్పుడు పెట్రోలు,డీజిల్, మద్యంలే ప్రధాన ఆదాయ వనరులు. అందుకే వాటిపై పడి దోచేస్తున్నారు. మన దగ్గరే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది.ప్రజల ఆరోగ్యం చెడిపోయినా పర్లేదు కానీ తమకు ఆదాయం రావాలని ప్రభుత్వాలు మద్యాన్ని తెగ ప్రోత్సహిస్తున్నాయి. ఒక దేశ ప్రభుత్వం అయితే తాజాగా మద్యం ఎక్కువగా తాగేందుకు ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పండి ప్లీజ్ అంటూ వేడుకుంటున్న పరిస్థితి నెలకొంది.

దేశ యువత మద్యపానానికి దూరం అవుతున్నారని.. అమ్మకాలు పడిపోతున్నాయని గ్రహించిన జపాన్ ప్రభుత్వం తాజాగా దేశవ్యాప్తంగా ఒక పోటీని పెట్టింది. యువకులు మద్యం తాగేలా ప్రోత్సహించేందుకు ఇది నిర్వహించింది. వారు తాగకపోవడంతో పన్ను రాబడి క్షీణించడంతో ప్రజలను మరింతగా మద్యం సేవించేలా ప్రోత్సహించే ఆలోచనల కోసం పిలుపునిచ్చింది.

నేషనల్ టాక్ ఏజెన్సీ (ఎన్.టీఏ) 'సకే వివా' అనే ప్రచారాన్ని అమలు చేస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో జీవనశైలి మార్పుల కారణంగా క్షీణించిన మద్యపానీయాలపై ఆకర్షణను పునరుద్దరించడానికి ఈ ప్రచారం తీసుకొచ్చింది. ఇందులో యువతను ప్రోత్సహించడానికి సరికొత్త ఆలోచనలను సమర్పించాలని.. 20-39 సంవత్సరాల మధ్య వయసు గల వ్యక్తులను ఆహ్వానించింది.

పోటీలో మంచి ఐడియాలు ఇచ్చి ఫైనలిస్టులుగా మారిన వారికి నవంబర్ 10న టోక్యోలో విలాసవంతమైన అవార్డుల కార్యక్రమానికి ఆహ్వానం పంపింది. విజేత ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి వ్యాపారాన్ని కూడా ప్రోత్సహిస్తామని పన్నుల కార్యాలయం ప్రకటించింది.

ఏ ప్రభుత్వాలైనా మద్యం కట్టడి చేయాలని.. ప్రజలను ఆ బానిస నుంచి మరల్చాలని చూస్తారు. కానీ ఆదాయం కోసం జపాన్ ప్రభుత్వం తాగమని అంటున్న జనం చేత అధికంగా మద్యం తాగేలా ప్రోత్సహించాలనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ప్రభుత్వం చేయాల్సిన పని ఇది కాదని హితవు పలుకుతున్నారు.

కరోనా తర్వాత జపాన్ లో ప్రజల ఆహారపు అలవాట్లు మారాయి. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్న జనాలు ఆల్కహాల్ వినియోగం బాగా తగ్గించారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది.
Tags:    

Similar News