కరోనా ఎఫెక్ట్: చుక్కలేక పిచ్చెక్కిపోతున్న మందుబాబులు

Update: 2020-03-28 12:10 GMT
ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టైంది. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తో తెలంగాణ - ఏపీలో మద్యం షాపులను ప్రభుత్వాలు బంద్ చేశాయి. దీంతో రోజూ మద్యం తాగితే కానీ పడుకోని మందుబాబులు ఆగమాగం అయిపోతున్నారు. ఇక వీకెండ్ లో పార్టీలు చేసుకునే వారు సైతం చుక్కలేక పిచ్చెక్కిపోతున్నారు. మద్యానికి బానిస అయిన వారైతే కల్తీకల్లు తాగి పిచ్చెక్కిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.

కరోనా ఎఫెక్ట్ ఎవరిమీద బాగా పడిందో తెలియదు కానీ.. మందుబాబులపై మాత్రం తీవ్రంగా ఉంది. మందు కోసం ఇప్పుడు వారంతా పిచ్చెక్కినట్టు ఆరాతీస్తున్నారు. మందు దొరకకా కల్తీకల్లు, గుడుంబా తాగుతున్న పరిస్థితి నెలకొంది. ఇక గ్రామాల్లో కల్లు కోసం బారులు తీరుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ తాటి - ఈత కల్లు వనాల వద్ద మందుబాబులు క్యూ కడుతున్నారు.

లాక్ డౌన్ తో సర్వం బంద్ అయిపోయింది. మద్యం దుకాణాలు బంద్ చేశారు. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలోని ఇందిరానగర్ లో తాజాగా మధు అనే పెయింటర్ మద్యం దొరక్క మతిస్థిమితం కోల్పోయి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

కేవలం 24గంటలే జనతా కర్ఫ్యూ అని ఎవరూ మద్యాన్ని కొని నిల్వ చేయలేదు. దీంతో ఫారిన్ బ్రాండ్లు తాగిన వారు కూడా ఇప్పుడు చీప్ లిక్కర్ సైతం తాగడానికి రెడీ అవుతున్నారు. బ్లాక్ లో కొంటున్నారు. బెల్ట్ షాపుల్లో డబుల్ రేట్లకు అమ్ముతున్నారు. ఇప్పుడు గ్రామాల్లో కూడా మద్యం ఖాళీ కావడంతో గుడుంబా - నాటు సారా - కల్లు వైపు పరిగెడుతున్నారు. కల్తీ కల్లుతో  ఆగమవుతున్నారు. కల్లు కూడా రూ.20కి దొరికే బాటిల్ రూ.50 చేశారు. కొందరు కల్లును కల్తీ చేయడంతో నిజామాబాద్ జిల్లాలో భూషన్ అనే వ్యక్తి తాగి చనిపోయాడు. చాలా మంది ఆస్పత్రి పాలయ్యారు.

ఇక మద్యం దొరక్క యాదాద్రి భువనగిరి జిల్లాలో మద్యం కోసం చోరీ జరిగింది.   చౌటుప్పల్ పరిదిలోని లింగోజిగూడెం వైన్స్ కే కన్నం వేసి మద్యం చోరీ చేసిన వైనం విస్తుగొలుపుతోంది. మద్యం కొరతతో ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో  పరిస్థితి  దిగజారుతోంది..   ఏప్రిల్ 14వరకు ఇదే పరిస్థితి ఉండడంతో మరెంత మంది మందుబాబులు హైరానా పడుతారనేది ఊహించడానికే భయంగా ఉంది.


Tags:    

Similar News