మొన్నామధ్య హైదరాబాదులో వెలుగుచూసిన మాదక ద్రవ్యాల (డ్రగ్స్) కేసు ఎంత సంచలనం రేపిందో చెప్పనక్కర లేదు. తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులకు చిక్కిన ఓ డ్రగ్స్ వ్యాపారిని ఆ శాఖ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తనదైన శైలిలో విచారిస్తే... మొత్తం డొంకంతా కదిలిపోయింది. ఏదో చిన్న డ్రగ్స్ రాకెట్ అనుకున్న ఈ దందాలో కీలక వ్యక్తి చిన్నవాడైనా... అతడి నెట్ వర్క్ చూసి కాకలు తీరిన పోలీసు అధికారిగా పేరున్న సబర్వాలే షాకయ్యారట. అయితే హైదరాబాదును డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలని కంకణం కట్టుకున్న సబర్వాల్ మొత్తం ఈ దందాను పెలకించి వేయాలని రంగంలోకి దిగారు. అక్కడక్కడా కొన్ని అవాంతరాలు ఎదురైనా... చివరకు తెలంగాణ సీఎం కేసీఆర్ చొరవతో ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురు ప్రముఖులను సబర్వాల్ విచారించారు. ఈ విచారణ సాగుతున్నంత సేపు ఏ పత్రికలో చూసినా... ఏ టీవీ ఛానెల్ చూసినా ఈ వార్తలే పతాక శీర్షికలను అలంకరించాయి.
ఎందుకంటే... ఈ దందాలో తెలుగు సినీ పరిశ్రమ టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటులు ఉండటంతో ఈ విషయం పెను కలకలమే రేపింది. హీరో రవితేజతో పాటు హీరోయిన్ చార్మీ - అగ్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ తో పాటు పలువురు యువ హీరోలు - కేరెక్టర్ ఆర్టిస్టులు - సాంకేతిక నిపుణులు కూడా ఈ కేసులో విచారణకు హాజరయ్యారు. తొలి విడత విచారణ పూర్తి అయ్యిందని సబర్వాల్ చెప్పిన ఓ నాలుగైదు రోజులకు ఈ కేసుకు సంబంధించి కొత్తగా అప్ డేట్స్ లేకపోవడంతో దాదాపుగా ఈ కేసును అందరూ మరిచిపోతున్నారు. అయితే నిన్న కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకున్న ఈ కీలక పరిణామంతో మళ్లీ ఈ కేసు పతాక శీర్షికలను ఎక్కడం ఖాయంగానే కనిపిస్తోంది. బెంగళూరులో నిన్న కేవలం ఓ వ్యక్తి అరెస్టు - అతడికి బెయిలిస్తూ అక్కడి స్థానిక కోర్టు తీసుకున్న నిర్ణయాలు చాలా చిన్నవిగానే కనిపిస్తున్నా... ఈ ఘటనకు సంబంధించి అక్కడి పోలీసులు న్యాయస్థానానికి అందజేసిన నివేదిక హైదరాబాదు డ్రగ్స్ దందాను మళ్లీ గుర్తు చేసిందనే చెప్పాలి.
అయినా ఆ ఘటనలో అరెస్టయిన వ్యక్తి ఎవరు?... అసలు ఏం జరిగిందన్న విషయానికి వస్తే... తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలికి చైర్మన్ గానే కాకుండా చిత్తూరు ఎంపీగా పనిచేసిన డీకే ఆదికేశవులునాయుడు గుర్తున్నారా. చిత్తూరు పట్టణానికి చెందిన డీకే... ఏపీకి పొరుగు రాష్ట్రాలుగా ఉన్న కర్ణాటక - తమిళనాడు రాజధానులు బెంగళూరు - చెన్నైలలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. చిత్తూరులో ఓ మోస్తరు పరిశ్రమలు ఉన్నా... బెంగళూరు - చెన్నైలపైనే డీకే దృష్టి సారించారు. చిత్తూరుకు ఈ రెండు నగరాలూ అత్యంత సమీపంగా ఉండటం కూడా ఇందుకు ఓ కారణంగా చెప్పాలి. ఈ క్రమంలో చిత్తూరు వాసి అయిన డీకే ఫ్యామిలీ దాదాపుగా బెంగళూరులోనే స్థిరపడిపోయింది. అనారోగ్యం కారణంగా గడచిన ఎన్నికలకు కాస్తంత ముందుగా డీకే చనిపోగా... ఎన్నికల్లో ఆయన సతీమణి డీకే సత్యప్రభ చిత్తూరు ఎమ్మెల్యేగా టీడీపీ టికెట్ పై పోటీ చేసి విజయం సాధించారు. చిత్తూరు ఎమ్మెల్యేగా సత్యప్రభ చిత్తూరుకే పరిమితం కాగా... ఆమె కుమారుడు - కుమార్తెలు బెంగళూరులోనే ఉంటున్నారు. మొన్నామధ్య నల్లధనం వెలికితీతలో భాగంగా ఐటీ అధికారులు చిత్తూరులోని డీకే సత్యప్రభ ఇంటితో పాటు బెంగళూరులోని ఆమె పిల్లల ఇళ్లల్లోనూ సోదాలు చేశారు.
ఇక తాజా విషయానికి వస్తే... డీకే మనవడు అయిన గీతా విష్ణు బెంగళూరులోనే ఉంటున్నాడు. ఓ నెలన్నర క్రితం అతడు తాగిన మత్తులో బెంజ్ కారుతో రోడ్డుపైకి ఎక్కి ఓ కారును గుద్దేశాడు. సదరు ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు. అయితే అతడితో పాటు అతడు ఢీకొట్టిన కారులోని వ్యక్తులకు గాయాలయ్యాయి. అయితే ప్రమాదంలో తానెక్కడో అరెస్ట్ అవుతానోనని భయపడిన గీతా విష్ణు ... ఘటనా స్థలిలోనే కారును వదిలేసి పారిపోయాడు. ఈ ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు గీతా విష్ణు కారును స్వాధీనం చేసుకోగా... అందులో గంజాయి దొరికిందట. దీంతో ఈ కేసులో లోతుగా పరిశీలిస్తే... ఇంకా చాలా విషయాలు వెల్లడవుతాయని భావించిన బెంగళూరు పోలీసులు... గీతా విష్ణు కోసం గాలిస్తూనే అతడికి సంబంధించి వివరాలను ఆరా తీశారు. అయితే ఈ విషయాలన్నింటినీ ఎక్కడో దూరంగా ఉండి గమనిస్తున్న గీతా విష్ణు ఇక పోలీసులకు లొంగిపోకపోతే మరింత ఊబిలో కూరుకుపోతానని భావించి నిన్న జయనగర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తన స్నేహితుల ద్వారా పోలీసులతో రాయబారం నడిపిన గీతా విష్ణు తనకు తాను లొంగిపోవడంతో పాటు వెనువెంటనే బెయిల్ కూడా పొందాడు.
నిన్న అరెస్ట్ చేసిన గీతా విష్ణు ను పోలీసులు కోర్టులో హాజరుపరచగా... అతడి అభ్యర్థన మేరకు అక్కడికక్కడే కోర్టు అతడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పోలీసులకు సమాచారం అందించకుండా నగరం విడిచిపోరాదని, పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరుకావాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదంతా బాగానే ఉన్నా... నిన్న అతడిని న్యాయమూర్తి ముందు హాజరు పరిచే సందర్భంగా కోర్టుకు పోలీసులు సమర్పించిన నివేదిక అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. హైదరాబాదులో వెలుగుచూసిన డ్రగ్స్ రాకెట్ కు చెందిన కీలక సూత్రధారి కెల్విన్ తో గీతా విష్ణు కు సంబంధాలున్నాయని, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరో రవితేజతోనూ అతడికి సంబంధాలున్నాయని పోలీసులు కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా గంజాయి రవాణాలో కీలక పాత్ర ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నడ సినీనటుడు దేవరాజ్ కుమారులు ప్రజ్వల్ - ప్రణవ్ తో విష్ణుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. వెరసి గీతా విష్ణు డ్రగ్స్ కేసులో పీకల్లోతు మునిగిపోయినట్టేనన్న మాట.