విలేక‌రికి ఫ‌త్వా జారీ చేసిన డ్ర‌గ్ మాఫియా

Update: 2017-08-02 04:14 GMT
కొద్ది రోజులుగా సంచ‌ల‌నం సృష్టిస్తున్న డ్ర‌గ్స్ మాఫియా వ్య‌వ‌హారం ఇప్పుడు మరో సంచ‌ల‌నానికి తెర తీసింది. డ్ర‌గ్స్ వినియోగం.. విస్తృతిపై కొద్దికాలంగా సాగుతున్న విచార‌ణ రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు.. జాతీయ స్థాయిలోనూ సంచ‌ల‌నానికి తెర తీస్తున్న సంగ‌తి తెలిసిందే.  డ్ర‌గ్స్ మీద క‌న్నెర్ర చేసి దాని తాట తీసేందుకు సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి అకున్ స‌బ‌ర్వాల్ కు ఇప్ప‌టికే డ్ర‌గ్స్ మాఫియా నుంచి  వార్నింగ్ లు వ‌చ్చాయి.

ఇప్పుడు అదే కోవలో మ‌రో విలేక‌రికి ఆన్ లైన్ బెదిరింపులు రావ‌ట‌మే కాదు.. స‌ద‌రు జ‌ర్న‌లిస్ట్ ఫ్యామిలీ మొత్తాన్ని ఏసేయాల‌న్న ఫ‌త్వాను జారీ చేయ‌టం ఇప్పుడు తీవ్ర సంచ‌ల‌నంగా మారింది.  డార్క్ నెట్ లో డ్ర‌గ్స్ వ్యాపారంపై ఓ ఇంగ్లిషు ప‌త్రిక‌లో ప్ర‌త్యేక క‌థ‌నం రాసిన స‌ద‌రు విలేక‌రిని.. అత‌డి కుటుంబాన్ని అంతం చేయాలంటూ ఓ డ్ర‌గ్ పెడ్ల‌ర్ ఆన్ లైన్ ఫ‌త్వా జారీ చేయ‌టం ఇప్పుడు  హాట్ టాపిక్ గా మారింది. స‌ద‌రు జ‌ర్న‌లిస్ట్‌ ను.. అత‌డి ఫ్యామిలీని అంతం చేస్తే.. బిట్ కాయిన్స్ రూపంలో న‌జ‌రానా అందిస్తామంటూ ఆఫ‌ర్ చేస్తున్న వైనం వెలుగులోకి వ‌చ్చింది.

డార్క్ నెట్ లో డ్ర‌గ్స్ దందాపై ఓ ఇంగ్లిష్ ప‌త్రికలో విశ్లేష‌ణాత్మ‌కంగా ఒక క‌థ‌నాన్ని రాశారో విలేక‌రి. ఇది స‌ద‌రు ప‌త్రిక‌లో బైలైన్ క‌థ‌నంగా ప‌బ్లిష్ అయ్యింది. ఈ క‌థ‌నంపై ఓ డ్ర‌గ్ ఫ్లెడ‌ర్ తీవ్రంగా స్పందించాడు. ఆన్ లైన్ లో స‌ద‌రు జ‌ర్న‌లిస్ట్ ఫ్యామిలీ వివ‌రాల్ని సేక‌రించ‌ట‌మే కాదు.. వారికి సంబంధించిన ఫోటోల్ని పొందుప‌రుస్తూ నెట్ లో ఫ‌త్వా జారీ చేశాడు. డార్క్ నెట్ డ్ర‌గ్ మాఫియాపై క‌థ‌నం రాసిన జ‌ర్న‌లిస్ట్‌ ను లేపేస్తే రూ.72 ల‌క్ష‌లు ఇస్తామ‌ని.. అదే స‌మ‌యంలో వారి కుటుంబ స‌భ్యుల్ని కానీ అంతం చేస్తే ఒక్కో వ్య‌క్తి రూ.10.8ల‌క్ష‌ల మొత్తాన్ని బిట్ కాయిన్ల రూపంలో న‌జ‌రానాగా అందిస్తామ‌ని ఆఫ‌ర్ చేశారు.

ఈ వ్య‌వ‌హారం మ‌రొక‌రి ద్వారా తెలుసుకున్న స‌ద‌రు విలేక‌రి.. పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఉదంతం ఇప్పుడు మీడియా స‌ర్కిల్స్ లో సంచ‌ల‌నంగా మారాయి. ఆన్ లైన్ ఫ‌త్వా ఎదుర్కొంటున్న స‌ద‌రు పాత్రికేయుడు ఈ విష‌యాన్ని హైద‌రాబాద్ సెంట్ర‌ల్ క్రైమ్ స్టేష‌న్ అధీనంలోని సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు కంప్లైంట్ చేశారు. ప్రాథ‌మికంగా సేక‌రించిన స‌మాచారం ప్ర‌కారం స‌ద‌రు బెదిరింపు మ‌హారాష్ట్రలోని నాసిక్ కు చెందిన డ్ర‌గ్ ప్లెడ‌ర్ గా భావిస్తున్నారు. ప్ర‌త్యేక బ్రౌజ‌ర్ల ద్వారా డార్క్ నెట్‌ ను వినియోగిస్తున్న ఈ ఐపీ అడ్ర‌స్ ల‌ను ట్రేస్ చేయ‌టం క‌ష్ట‌సాధ్యంగా చెబుతున్నారు. వీటి ప్ర‌ధాన స‌ర్వ‌ర్లు ర‌ష్యా.. పోలెండ్ లాంటి దేశాల్లో ఉంటాయంటున్నారు. అయితే.. ఈ వ్య‌వ‌హారాన్ని సీరియ‌స్ గా తీసుకున్న పోలీసులు.. దీన్ని చేధించేందుకు వీలుగా ప్ర‌య‌త్నాల్ని ముమ్మ‌రం చేశారు.
Tags:    

Similar News