జగన్ సీఎం సార్.. ఇదే మా చివరి సారి ఓటు.. బ్రాండ్స్ మార్చకపోతే!

Update: 2021-03-15 06:30 GMT
ఎవ‌రి బాధ వారిది అనే దానికి ఇదో ఉదాహ‌ర‌ణ. మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో గెలిచి స‌త్తా చాటాల‌ని విప‌క్షాలు స‌ర్వ‌శ‌క్తులూ ధార‌పోస్తుంటే.. జైత్ర‌యాత్ర కొన‌సాగించాల‌ని అధికార ప‌క్షం ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. ఈ విధంగా మునిసిప‌ల్ పోరు హోరాహోరీగా సాగింది.

అయితే.. త‌మ బాధ ఎవ‌రూ వినిపించుకోవ‌ట్లేద‌ని తాగుబోతులు తెగ బాధ‌ప‌డిపోతున్నారు. స‌రైన స‌రుకు అందుబాటులో లేద‌ని, అల‌వాటు ప‌డిన రుచి త‌గ‌ల‌క‌ నాలుక చ‌చ్చుబ‌డిపోయిందంటూ తీవ్ర ఆవేద‌న‌కు గుర‌వుతున్నారు. మ‌రి, ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకుపోవ‌డం ఎలా అని ఆలోచించి.. స‌మిష్టి స‌మావేశంలో కీల‌క‌ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టున్నారు.

ఆ నిర్ణ‌యాన్ని మునిసిప‌ల్‌ ఎన్నిక‌ల వేళ అమ‌లు ప‌రిచారు కూడా! అదేమంటే.. ఏపీ ప్ర‌భుత్వం మ‌ద్యం అమ్మ‌కాల్లో కొత్త బ్రాండ్ల‌ను ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. అయితే.. ఈ కొత్త స‌రుకు త‌మ‌కు అంత‌గా టేస్టు లేద‌ని, పాత బ్రాండ్ల‌ను మ‌ళ్లీ అందుబాటులోకి తేవాల‌ని ప్ర‌భుత్వానికి విన్న‌వించారు.

ఇందుకోసం బ్రాండ్ల పేర్ల‌ను కూడా జ‌త చేసి.. తాగుబోతుల విన్న‌పం అంటూ ఓటుతోపాటు స్లిప్పులు కూడా వేశారు. కొత్త‌గా తెచ్చిన హైద‌రాబాద్‌, దారు, సుప్రీం, జంబో అంత‌గా బాగోలేవ‌ని, పాత బ్రాండ్లుగా ఉన్న బ్లాక్ డాగ్‌, రాయ‌ల్ స్టాగ్‌, ఇంపీరియ‌ల్ బ్లూ వంటివి అందుబాటులోకి తేవాల‌ని ముఖ్య‌మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు. అంతేకాదు.. ఇలా చేయ‌క‌పోతే ఇదే మీకు వేస్తున్న ఆఖ‌రి ఓటు అంటూ పేర్కొన‌డం గ‌మ‌నార్హం. నంద్యాలలోని ఓ వార్డులో ఈ ఘ‌ట‌న వెలుగు చూసింది. ఇది చూసిన ఎన్నిక‌ల సిబ్బంది.. తాగుబోతుల బాధ భ‌లేగా ఉంద‌ని న‌వ్వుకున్నారు.
Tags:    

Similar News