మావోయిస్టుల లైఫ్ లైన్ కు లైఫ్ ఇంప్రిజన్ మెంట్

Update: 2017-03-08 05:04 GMT
ఆయనకు రెండు కాళ్లూ లేవు.. చక్రాలకుర్చీకే పరిమితం. కానీ.. అపర మేధావి.. మావోయిస్టులకు సానుభూతి పరుడు.. జనజీవనంలో ఉంటూ మావోయిస్టు సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం వంటి కీలక పనుల్లో ఉంటారాయన. దీంతో ప్రభుత్వం ఆయనపై కన్నెర్ర చేసింది కేసులు పెట్టింది.. కోర్టుకు ఆధారాలిచ్చింది. కోర్టు యావజ్జీవ శిక్ష వేసింది.
    
ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాకు కోర్టు యావజ్జీవ జైలు శిక్ష విధించింది. మావోయిస్టులతో సంబంధాలున్నట్టు నిర్ధారణ కావడంతో  ఆయనకు, మరో ఐదుగురికి జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. సాయిబాబా ప్రస్తుతం సస్పెన్షన్‌ లో ఉన్నారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై గతంలోనే ఆయన్ను  అరెస్టు చేశారు. అయితే వికలాంగుడైన ఆయన ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు 2016 ఏప్రిల్‌ లో సాయిబాబాకు బెయిల్ మంజూరు చేసింది.
    
ప్రొఫెసర్ సాయిబాబాతోపాటు జేఎన్‌ యు విద్యార్థి హేం మిశ్రా - మాజీ పాత్రికేయుడు ప్రశాంత్ రహీ - మహేష్ తిర్కే - పాండు నరొటే - విజయ్ తిర్కేలకు సెషన్స్ కోర్టు జైలు శిక్ష విధించింది. సాయిబాబా మరో నలుగురికి జీవిత ఖైదు విధించి, విజయ్‌ కు పదేళ్ల శిక్ష వేసింది. అనారోగ్య కారణాలు చూపి బెయిల్‌పై ఉన్న సాయిబాబా దేశ - విదేశాల్లో అనేక సదస్సులు - సమావేశాలకు హాజరై మావోయిస్టు సిద్ధాంతాల ప్రచారం చేశారని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి సతియానాథన్ కోర్టుకు తెలిపారు. దివ్యాంగుడైన ప్రొఫెసర్ ప్రవర్తనలో ఎలాంటి మార్పూ రాలేదని ఆరోపించారు. నిందితులందరీకి జీవిత ఖైదు విధించాలని ప్రాసిక్యూటర్ డిమాండ్ చేశారు. 2013 ఆగస్టులో గడ్ఛిరోలి జిల్లా అహేరిలో మహేష్ తిర్కే - పాండు నరొటే - హేం తిర్కేలను పోలీసులు అరెస్టు చేశారు. తరువాత ప్రశాంత్ రాయ్ - విజయ్ తిర్కేలను గోండి జిల్లా డియోరిలో అరెస్టు చేశారు. దివ్యాంగుడైన సాయిబాబా వీల్‌ చైర్‌ పైనే ఉంటారు. మావోయిస్టు సిద్ధాంతాలు ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలపై 2014 మేనెలలో అరెస్టు చేశారు.
    
కాగా మావోలతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ప్రొఫెసర్‌ సాయిబాబాతోపాటు మరో నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ గడ్చిరోలి సెషన్స్  కోర్టు ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని విరసం నేత వరవరరావు అంటున్నారు.  నిషేధిత పార్టీతో సంబంధం ఉండడం లేదా ఆ పార్టీ రాజకీయ విశ్వాసం కలిగి ఉండడం, చివరకు ఆ పార్టీ సభ్యత్వం కలిగి ఉండడం వంటివి దేనికవిగా  శిక్షార్హం కావని  సుప్రీంకోర్టు ఇటీవలే ఓ కేసులో తీర్పు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News