డు..డు.. డు.. డుప్లెసి.. బెంగళూరు రాత మారుస్తాడా?

Update: 2022-03-14 02:30 GMT
పద్నాలుగేళ్లు గడిచిపోయాయి.. ఎందరో పెద్ద ఆటగాళ్లు ఆ జట్టుకు ఆడారు.. విరాట్ కోహ్లిలాంటి మహామహులు కెప్టెన్ గానూ వ్యవహరించారు. దక్షిణాఫ్రికాకు చెందిన మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ కూడా తనవంతు విజయాలనందించాడు. కానీ, ఆ జట్టుకు ట్రోఫీ కల మాత్రం నెరవేరలేదు. మూడుసార్లు ఫైనల్ కు వచ్చినా కప్పు దక్కలేదు. ఆ జట్టే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ). ఆ ట్రోఫీనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). అలాంటి ఆర్సీబీ కెప్టెన్సీని ఈసారి కోహ్లి వదిలేశాడు.

రిటైనర్లు పోను జట్టు కూడా మారింది. కెప్టెన్ గా దక్షిణాఫ్రికా వెటరన్ బ్యాట్స్ మన్ ఫాఫ్ డు ప్లెసిస్ వచ్చాడు. సొంత దేశం జట్టుకు సారథ్యం వహించిన అనుభవం డుప్లెసికి ఉంది. అంతేకాదు.. గత రెండు సీజన్లలో చెన్సై సూపర్ కింగ్స్ తరఫున మంచి ఇన్నింగ్స్లులు ఆడాడు అతడు. దీంతో డుప్లెసి సారథ్యంలో అయినా ఆర్సీబీ రాత మారుతుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

అభిమానం మెండు.. అయినా?

ఒక్కమాటలో చెప్పాలంటే ఐపీఎల్ లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత ఆర్సీబీకే అభిమానుల ఆదరణ ఎక్కువ. కోహ్లి ఆ జట్టుకు ఆడుతుండడమే ఇందుకు కారణం. మరోవైపు బెంగళూరు ప్రత్యేకతలు ఉండనే ఉన్నాయి. దీంతోనే ఆర్సీబీ కప్పు గెలవాలని చాలామంది ఆశిస్తుంటారు. కాగా, లీగ్ మొదలైన రెండే ఏడాదే (2009) ఫైనల్ కు చేరిన ఆర్సీబీ.. నాటి దక్కన్ చార్జర్స్ చేతిలో ఓడింది.

2011లో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్లో దెబ్బకొట్టింది. ఇక దాదాపు 950 పరుగులతో విరాట్ కోహ్లి చెలరేగిన 2016 సీజన్ లో అయితే.. కప్పు ఖాయం అనిపించింది. కానీ, సన్ రైజర్స్ హైదరాబాద్ రూపంలో మరోసారి హైదరాబాద్ జట్టు దెబ్బకొట్టింది. ఇలా కప్పు మూడుసార్లూ చేజారింది.

ఈసారైనా..

2022 సీజన్ కు ఆర్సీబీలో పెను మార్పులు జరిగాయి. కెప్టెన్ గా కోహ్లి లేడు. డివిలియర్స్ రిటైరయ్యాడు. మంచి ఫామ్ లో ఉన్న సిరాజ్ రిటైన్ అయ్యాడు. ఆస్టేలియా పేసర్ హాజల్ వుడ్ కు ఇతడు సరిజోడి. బ్యాటింగ్ లో మ్యాక్స్ వెల్ ఉండడం పెద్ద సానుకూలత.

 వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ పుంజుకొంటే జట్టుకు పెద్ద బలం. మరోవైపు కోహ్లి, కెప్టెన్ డుప్లెసి ఓపెనింగ్ కు దిగుతారు. వీరు కాక మిగతా వారిలో బ్యాటింగ్ భారాన్ని మోసేదెవరో కచ్చితంగా చెప్పలేం. ఆసీస్ ఆటగాడు ఫిన్ అలెన్ మంచి హిట్టరే. హైదరాబాదీ ఎడమ చేతివాటం పేసర్, పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కుమారుడు చామా మిలింద్ ఈసారి ఆర్సీబీ జట్టులో ఉన్నాడు. అతడు రాణిస్తే జట్టుకు బలమే. చూద్దాం ఏం జరుగుతుందో?

 
    

Tags:    

Similar News