నితీశ్ సర్కార్ కు షాక్.. బలపరీక్ష వేళ.. ఆర్జేడీ నేతల ఇళ్లల్లో సోదాలు

Update: 2022-08-24 07:31 GMT
అనూహ్య పరిణామాల మధ్య రోజు వ్యవధిలో బిహార్ లోని బీజేపీ మద్దతుతో నడిచే నితీశ్ సర్కారు రాజీనామా చేసి.. రోజు తిరగకముందే కొత్త మిత్రుడు ఆర్జేడీ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీశ్ కుమార్. కళ్లు మూసి తెరిచే సరికి పాత ప్రభుత్వం పోయి.. కొత్త ప్రభుత్వం కొలువు తీరటం..

ముఖ్యమంత్రిగా నితీశ్ కుమారే ఉన్నా.. మిగిలిన వారి విషయంలో మార్పులు చోటు చేసుకోవటమే కాదు.. అప్పటివరకు విపక్షంగా ఉన్న ఆర్జేడీ అధికారపక్షంగా అవతరిస్తే.. అప్పటివరకు పవర్ చేతిలో ఉన్న బీజేపీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చిన పరిస్థితి.

ఇదంతా నితీశ్.. లాలూ కుమారుడు తేజస్వీ ఆడిన ఆటగా అభివర్ణిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. బిహార్ ఎపిసోడ్ కు ముందు వరకు మోడీషాలు షాకులు ఇస్తుంటే.. మిగిలిన పార్టీల వారు వాటిని భరిస్తుంటారు. అందుకు భిన్నంగా తొలిసారి మోడీషాలకు దిమ్మ తిరిగే షాకు ఇవ్వటంలో నితీశ్..

తేజస్వీ యాదవ్ లు సక్సెస్ అయ్యారన్న మాట వినిపించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. గవర్నర్ సూచన మేరకు ఈ రోజు (బుధవారం) ఆగస్టు 24న కొత్తగా పగ్గాలు చేపట్టిన ప్రభుత్వం బిహార్ అసెంబ్లీ సభలో బలపరీక్షను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే ఈ రోజు (బుధవారం) బిహార్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. బలపరీక్ష కు కొన్ని గంటల ముందు.. ప్రభుత్వంలో భాగస్వామి పార్టీ అయిన ఆర్జేడీకి చెందిన సీనియర్ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు జరపటం సంచలనంగా మారింది. ముగ్గురు సీనియర్ నేతల ఇళ్లల్లో సీబీఐ తనిఖీలు చేపట్టింది. ఇదంతా ఎందుకు? అని ప్రశ్నిస్తే.. అప్పుడెప్పుడో యూపీఏ1లో లాలూరైల్వే మంత్రిగా ఉన్న వేళలో ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కాం జరిగిందని.. అందులో భాగంగా తనిఖీలు చేస్తున్నట్లు చెబుతున్నారు.

అయితే.. ఈ సోదాలన్నీ కూడా బలపరీక్ష రోజునే జరగటంతో.. కావాలనే ఇలా చేస్తున్నారని మోడీ సర్కారుపై మండిపడుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. సీబీఐ దాడులకు కొద్ది గంటల ముందే.. ఆర్జేడీ అధికార ప్రతినిధి దాడులపై ట్వీట్లు చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. సీబీఐ దాడులు చేస్తారన్న విషయాన్ని అధికారపార్టీ గుర్తించిందన్న మాట వినిపిస్తోంది. మరి.. బలపరీక్ష ఏమవుతుందన్న ఆసక్తి వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News