దువ్వాడ ఎపిసోడ్ లో వెనుక ఉన్న‌దెవ‌రు ?

Update: 2022-05-31 13:30 GMT
నిన్న‌టి వేళ దువ్వాడ శ్రీ‌నివాస్ అనే ఎమ్మెల్సీ నోటికి వ‌చ్చిందంతా వాగారు. ఆ విధంగా ఆయ‌న మాట తీరుపై విమ‌ర్శ‌లున్నాయి. కింజ‌రాపు అచ్చెన్నాయుడు అనే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడ్ని ఉద్దేశించి, రాయ‌లేని భాష‌లో మాట‌లు అన్నారు. గ‌తంలో కూడా ప‌లు మీడియా వేదిక‌ల‌పై ఆయ‌న ఇదే విధంగా మాట్లాడారు.

గ్రానైట్ వ్యాపారం చేసుకునే దువ్వాడకు ఇంత ధైర్యం ఎక్క‌డిది అన్న ప్ర‌శ్న ఇప్పుడు విన‌వ‌స్తోంది. గ‌తంలో టీడీపీ హ‌యాంలో ఆయ‌న వ్యాపారాల‌పై అచ్చెన్న ఉక్కుపాదం మోపారన్న వాద‌న ఉంది. అందుకే ఆయ‌న ఇప్పుడీవిధంగా రాయలేని భాష‌లో మాట్లాడుతూ ఉన్నార‌ని తెలుస్తోంది.

వాస్త‌వానికి వ‌రుస ఎన్నిక‌ల్లో దువ్వాడ ప‌రాభ‌వం పొందారు. కింజ‌రాపు కుటుంబం ఆయ‌న్ను ఓడిస్తూనే ఉంది. టెక్క‌లి ఎమ్మెల్యేగా పోటీ చేసిన‌ప్పుడు కానీ, శ్రీ‌కాకుళం ఎంపీగా పోటీచేసిన‌ప్పుడు కానీ ఆయ‌న ఘోర ప‌రాభ‌వం అందుకున్నారు. అందుకే అధినేత‌కు ద‌గ్గ‌ర‌గా ఉండేందుకు చాలా సార్లు చాలా ప్ర‌య‌త్నాలు చేసి ప్ర‌త్య‌క్ష పోరులో ఇమ‌డ‌లేక, శాస‌న మండ‌లికి త‌న‌ను పంపించాల‌ని వేడుకున్నారు.

ఆ విధంగా జ‌గ‌న్ కు ఓ విధంగా గ‌తంలో ఉన్న సానుభూతి కార‌ణంగానే దువ్వాడ‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చారు. ప‌ద‌వి ద‌క్కిన రోజు నుంచి నియోజ‌క‌వ‌ర్గంకు సంబంధించి అభివృద్ధి మాట అటుంచితే త‌రుచూ ఆయ‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తున్నారు.

వాస్త‌వానికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో దువ్వాడ‌కు టెక్క‌లి నుంచి పోటీ చేసే అవ‌కాశమే రాదు. జ‌గ‌న్ కూడా దువ్వాడ‌ను ఇక‌పై ప్రోత్స‌హించ‌రు. అదే ప‌నిగా కింజ‌రాపు కుటుంబాల‌ను తిట్ట‌డం కూడా అంత మంచిది కాద‌న్న భావ‌న‌లోనే వైసీపీ అధినాయ‌క‌త్వం కూడా ఉంది. ఇప్ప‌టికిప్పుడు దువ్వాడ ప‌ద‌వికి వ‌చ్చిన గండం ఏమీ లేక‌పోయినా జగ‌న్ కోసం తాను ఆత్మాహుతి  ద‌ళంగా మారుతాన‌ని చెప్ప‌డం మ‌రింత వివాదాల‌కు తావిస్తోంది.

ఇదే స‌మ‌యంలో సొంత పార్టీలోనే ఆయ‌న్ను  వ్య‌తిరేకిస్తున్న వ‌ర్గం ఇప్ప‌టికే అధిష్టానానికి అనేక‌సార్లు ఫిర్యాదులు చేసింది. టెక్కలి నియోజ‌క‌వ‌ర్గంలో అటు మాజీ మంత్రి కిల్లి కృపారాణి కానీ ఇటు కాళింగ కార్పొరేష‌న్ చైర్మ‌న్ పేరాడ తిల‌క్ కానీ ఆయ‌న్ను అంత‌గా ప్రోత్సహించరు. ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా నిల‌బ‌డ‌రు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న టెక్క‌లి నుంచి పోటీ చేయ‌డం అన్న‌ది జ‌ర‌గ‌ని ప‌ని. పోనీ శ్రీ‌కాకుళం ఎంపీ టికెట్ అయినా ద‌క్కుతుందా అంటే ఆ కోటాకు కూడా చాలా మంది ఆశావహులు ఉన్నారు.

వీట‌న్నింటినీ ప‌రిగ‌ణ‌న‌లో తీసుకునే అధినాయ‌కత్వం మ‌ద్ద‌తు పొందేందుకు, మెప్పు పొందేందుకు దువ్వాడ ఆ విధంగా వీర విధేయ ప‌లుకులు ప‌లుకుతున్నార‌ని సొంత పార్టీ వ‌ర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. క‌నుక ఇప్ప‌టికైతే ఆయ‌న వెనుక ఎవ్వ‌రూ లేరు.. ఉండ‌రు కూడా ! గ‌తంలో అధికార పార్టీ టీడీపీ  ఉన్న‌ప్పుడు కేసుల‌కు భ‌య‌ప‌డి పొరుగు రాష్ట్రం ఒడిశాలో త‌ల‌దాచుకున్నారని, ఈ సారి దేశం దాటిపోవ‌డం ఖాయ‌మ‌ని అచ్చెన్న అభిమానులు సోష‌ల్ మీడియాలో కౌంట‌ర్లు ఇస్తున్నారు. అయితే దువ్వాడ వ్యాఖ్య‌ల‌పై అచ్చెన్న ఇంత వ‌ర‌కూ స్పందించ‌క‌పోవ‌డం గ‌మనార్హం.
Tags:    

Similar News