చంద్రబాబు మాయ ఉచ్చుపై ద్వారంపూడి కీలక వ్యాఖ్యలు

Update: 2021-11-22 02:30 GMT
టీడీపీ అధినేత చంద్రబాబుపై కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సానుభూతి కోసమే చంద్రబాబు కొత్త డ్రామా మొదలుపెట్టారని విమర్శించారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని ఎవరూ ఏమీ అనలేదని స్పష్టం చేశారు. ఆమెను అనవసరంగా రాజకీయాల్లోకి లాగుతున్నారంటూ మండిపడ్డారు. కావాలంటే అసెంబ్లీ రికార్డులు పరిశీలించుకోవచ్చని సూచించారు.

విశాఖలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ద్వారంపూడి అసెంబ్లీలో జరిగిన వ్యవహారంపై వివరణ ఇచ్చారు. అసెంబ్లీలో జరిగింది వేరు.. బయట జరుగుతున్న ప్రచారం వేరని స్పష్టం చేశారు. చంద్రబాబు తన సతీమణిని అనవసరంగా రాజకీయాల్లోకి లాగుతున్నారని మండిపడ్డారు. గతంలోనూ హెరాయిన్ కేసులో తన పాత్ర ఉందని తప్పుడు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేసిన ద్వారంపూడి తనను ఒక మాట అంటే నాలుగు మాటలు అంటానని స్పష్టం చేశారు.

టీడీపీ నాయకులు ఆలోచించి మాట్లాడాలని ద్వారంపూడి హితవు పలికారు. దివంగత నేత ఎన్టీ రామారావు కుటుంబాన్ని ఏకం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. ఎన్టీఆర్ కుమార్తెగా భువనేశ్వరిని గౌరవిస్తామన్నారు. అసెంబ్లీలో జరిగిన వ్యవహారంపై నందమూరి కుటుంబ సభ్యులకు అవగాహన లేదని.. త్వరలోనే నందమూరి కుటుంబ సభ్యులు జరిగిన విషయం తెలుసుకుంటారని తెలిపారు.

భువనేశ్వరి గురించి రన్నింగ్ కామెంట్రీలో కూడా ఎవరూ కనీసం మాట్లాడలేదన్నారు. త్వరలోనే నందమూరి కుటుంబ సభ్యులు జరిగిన విషయం తెలుసుకుంటారన్నారు. అనవసరంగా చంద్రబాబు మాయ ఉచ్చులో పడకండి అంటూ ద్వారంపూడి హితవు పలికారు.
Tags:    

Similar News