వాటిపైన ఆధారపడే ఏపీలో ముందస్తు ఎన్నికలు!

Update: 2023-01-06 06:50 GMT
ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రతిపక్షాలు నమ్ముతున్న సంగతి తెలిసిందే. ఈ దిశగా తమ పార్టీ శ్రేణులను టీడీపీ, జనసేన, బీజేపీ, తదితర పార్టీలు ఇప్పటికే అప్రమత్తం చేశాయి. మరోవైపు అప్పుడే ఎన్నికల ప్రచారమా అన్నట్టుగా ప్రతిపక్షాలు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నాయి.

మరోవైపు ఏపీ సీఎం జగన్‌ సైతం ఇటీవల దూకుడు పెంచారు. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు గడప గడపకు మన ప్రభుత్వం పేరిట ఇంటి ఇంటికీ తిరుగుతున్నారు. మరోవైపు జగన్‌ సైతం వివిధ పథకాలను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడానికి వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. భారీ ఎత్తున జనాన్ని సమీకరించి సభలు నిర్వహిస్తున్నారు.

ఇదే క్రమంలో ఇటీవల ఢిల్లీ వెళ్లిన జగన్‌.. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ముందస్తు ఎన్నికల ప్రస్తావన తెచ్చారని టాక్‌ నడుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌-డిసెంబర్‌ మధ్య ముందస్తు ఎన్నికలు ఉంటాయని సమాచారం. వాస్తవానికి 2024 ఏప్రిల్‌/మేలో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఆరు నెలలు ముందుగానే జగన్‌ ఎన్నికలకు వెళ్లొచ్చని ప్రచారం సాగుతోంది.

అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్తారా లేకుంటే 2024 వేసవి వరకు ఎదురుచూస్తారా అనేది ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపైన ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.

ఈ ఏడాది ఏపీ శాసనమండలిలో 23 స్ధానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. సభ్యుల పదవీకాలం పూర్తి కావడంతో ఖాళీ అయ్యే 23 స్థానాలకు మూడు విడతలుగా ఎన్నికలు ఉంటాయి. ఇందులో భాగంగా మార్చి 29న, మే 1న, జూలై 20న ఈ 23 మంది ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారని చెబుతున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో తమ అభ్యర్ధుల్ని నిలబెట్టి గెలిపించుకునేందుకు వైసీపీ సిద్ధమవుతోంది.

ఈ 23 మంది ఎమ్మెల్సీల్లో కొందరిని ఎమ్మెల్యేలు, మరికొందరిని స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నుకోనున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి బలమున్న నేపథ్యంలో అత్యధిక స్థానాలను వైసీపీ కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

వైసీపీకి ఉన్న బలం రీత్యా ఈ 23 సీట్లలో కనీసం 14 సీట్లను వైసీపీ గెలచుకుంటుందని చెబుతున్నారు. తద్వారా వైసీపీ బలం శాసనమండలిలో 46కి చేరుకుంటుందని అంటున్నారు. 2024లో మండలి ఎన్నికలు ఉండవని తెలుస్తోంది. మళ్లీ సభ్యులు పదవీ విరమణ చేసేదే 2025లోనే అని అంటున్నారు. అంటే ఈ ఏడాది ఎన్నికలు జరిగితే మళ్లీ మండలికి ఎన్నికలు జరిగేది 2025లోనే అని టాక్‌.

ఈ నేపథ్యంలో మండలి ఎన్నికల్లో ఫలితాలను బట్టి వైసీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేయొచ్చని అంటున్నారు. ఖాళీ అయ్యే 23 ఎమ్మెల్సీ సీట్లలో అత్యధికంగా వైసీపీ గెలుచుకోగలిగితే అసెంబ్లీ ముందస్తు ఎన్నికలకు వైసీపీ మొగ్గుచూపుతుందని సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు దక్కకపోతే మాత్రం ముందస్తుకు వెళ్లదని చెబుతున్నారు. 



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News