ఢిల్లీలో భూకంపం..వ‌ణికిన ప్ర‌జ‌లు

Update: 2019-12-20 16:11 GMT
దేశ రాజ‌ధాని ఢిల్లీ శుక్ర‌వారం సాయంత్రం భూప్ర‌కంప‌న‌ల‌తో వ‌ణికింది. సాయంత్రం 5:12 సమయంలో ఉత్తర భారతంలో పలుచోట్ల.. కాశ్మీర్ - పంజాబ్ - హర్యానాల్లో ఈ ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు ఒక నిమిషం పాటు చాలా స్వ‌ల్పంగా ఈ ప్ర‌కంప‌న‌లు కొన‌సాగాయాట‌. ఈ భూకంప తీవ్రత రిక్ట‌ర్ స్కేల్‌ పై 6.3గా న‌మోదు అయ్యింది. అప్ఘ‌నిస్తాన్ లోని హిందూకుష్ భూకంప కేంద్రంగా ఉన్నట్లు సమాచారం.

భూకంప ప్ర‌భావంతో ఇళ్లు కూడా ఊగ‌డంతో ఒక్క‌సారిగా భ‌య‌బ్రాంతుల‌కు గురైన ప్ర‌జ‌లు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు ప్రాణ‌భ‌యంతో ప‌రుగులు తీశారు. అపార్ల‌మెంట్ల‌లో ఉండే వాళ్లు - ఆఫీసుల్లో ఉండే వాళ్లు హ‌డావిడిగా కింద‌కు దిగేయ‌డంతో కొద్ది సేపు ప‌నులు అన్ని స్తంభించిపోయాయి. అస‌లు ఏం జ‌రిగిందో ?  ఎవ్వ‌రికి అర్థం కాలేదు. అయితే.. ఇప్పటి వరకు భూకంపం వల్ల ప్రాణనష్టం - ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

మ‌రోవైపు ఈ భూకంప తీవ్ర‌త పాకిస్తాన్‌ ను కూడా తాకింది. భూకంప కేంద్రం పాకిస్తాన్‌ లోని రావల్పిండికి 92 కిలోమీటర్ల దూరంలో ఉంద‌ని గుర్తించారు. పాకిస్తాన్‌ లో దీని తీవ్ర‌త 6.1గా నమోదయినట్లు యూరోపియన్-మెడిటేరియన్ సెస్మొలాజికల్ సెంటర్(EMSC) వెల్లడించింది. అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) మాత్రం ఈ భూకంప తీవ్ర‌త 5.8గా పేర్కొంది. 


Tags:    

Similar News