సౌత్ లో మరెక్కడా లేని ‘కోబాస్ 8800’ నిమ్స్ కు వచ్చేసింది

Update: 2020-09-26 23:30 GMT
అత్యాధునిక యంత్రం ఒకటి హైదరాబాద్ నిమ్స్ కు వచ్చింది. దక్షిణాది రాష్ట్రాల్లో మరెక్కడా లేని ఈ యంత్రం నిమ్స్ లో పని చేయటం ప్రారంభించింది. ఈ యంత్రం పుణ్యమా అని.. కరోనాతో పాటు.. కిడ్నీ.. లివర్.. గుండె మార్పిడి.. బోన్ మారో మార్పిడికి సంబంధించిన పరీక్షలు ఒకే దఫాలో చేసే అవకాశం ఉంది. దీని ఖరీదు రూ.6కోట్లుగా చెబుతున్నారు. ఈ పరీక్షా కేంద్రాన్ని తాజాగా షురూ చేశారు.

ఈ యంత్రం ప్రత్యేకత ఏమంటే.. ఒక రోజులో 3వేల కరోనా టెస్టుల్నివిశ్లేషించే సామర్థ్యం దీని సొంతం. కాకుంటే.. ఈ యంత్రంతో పని ప్రారంభించే మొదటి మూడున్నర గంటలో మాత్రం అతి తక్కువ ఫలితాల్ని ఇస్తుంది. తర్వాత నుంచి మాత్రం ప్రతి అరగంటకు పెద్ద ఎత్తున ఫలితాల్ని అందించే ప్రత్యేకత దీని సొంతం. ఒకేసారి పలు పరీక్షలు నిర్వహించుకునేందుకు వీలుగా ఈ యంత్రం ఉంటుంది.

ఇలాంటి యంత్రాలు కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్న వేళ.. వచ్చి ఉంటే బాగుండేది. అందుకు భిన్నంగా కేసుల నమోదు తగ్గిన తర్వాత అందుబాటులోకి రావటం గమనార్హం. ఇదిలా ఉంటే.. కరోనా నుంచి ప్రభుత్వం బయటకు వచ్చేస్తుంది. ఇప్పటివరకు కరోనా సేవలు తప్పించి మరే ఇతర వైద్య సేవలు చేయని పరిస్థితి. పూర్తిస్థాయి కోవిడ్ ఆసుపత్రిగా పేర్కొనే గాంధీలోనూ ఇతర వైద్య సేవల్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే బాటలో నిమ్స్ లోనూ అన్ని రకాల వైద్య సేవల్ని మరో పదిహేను రోజుల్లో అందించాలన్న ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లుగా చెబుతున్నారు.
Tags:    

Similar News