ఈవీఎంల ట్యాంప‌రింగ్ జ‌రిగిందా?

Update: 2018-12-03 08:23 GMT
ఓ వైపు ఈవీఎంల ప‌నితీరుపై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుగుతుండ‌గా మ‌రోవైపు కీల‌క రాష్ట్రంలో ఈవీఎంల కేంద్రంగా కొత్త ర‌చ్చ మొద‌లైంది. మధ్యప్రదేశ్‌ లో ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌నే ఈవీఎంలు ప్ర‌భావితం చేయ‌నున్నాయ‌నే ఆందోళ‌న తెర‌మీద‌కు వ‌చ్చింది. ఆ రాష్ట్ర రాజ‌ధాని భోపాల్‌ లోని స్ట్రాంగ్ రూం పరిధిలో గత నెల 30న విద్యుత్ సరఫరాలో అంతరాయం చోటుచేసుకుంది. భోపాల్‌ లోని స్ట్రాంగ్ రూమ్ వద్ద గత నెల 30న ఉదయం 8.19 గంటల నుంచి 9.35 గంటల వరకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో సీసీటీవీ కెమెరాలు - ఎల్‌ ఈడీ స్క్రీన్ - పని చేయలేదు. దీంతో వివిధ వ‌ర్గాలు ఆందోళ వ్య‌క్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ)ని ఆశ్ర‌యించాయి. ఈ నేప‌థ్యంలో ఈసీ కూడా విద్యుత్ అంత‌రాయం వల్ల సీసీటీవీ కెమెరాలు గంట సేపు పని చేయని మాట నిజమేనని అంగీకరించింది. ప్రస్తుతం సదరు స్ట్రాంగ్ రూమ్ వద్ద సీసీటీవీ కెమెరాలు పని చేస్తున్నాయని ఈసీ ధ్రువీకరించింది.

పోలింగ్ ప్రారంభానికి ముందు షాజాపూర్‌ లో బీజేపీ మద్దతుదారుడికి చెందిన హోటల్‌లో ఈవీఎంలు దొరికాయి. వాటిని పోలింగ్‌ లో వాడలేదని ధ్రువీకరించిన ఈసీ.. ఈ ఘటనలోనూ ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసింది. దీనికి తోడుగా - సాగర్ జిల్లా కలెక్టరేట్‌ కు పోలింగ్ జరిగిన 48 గంటల తర్వాత నంబర్ లేని స్కూల్ బస్సులో ఈవీఎంలు చేరడం మరిన్ని అనుమానాలకు దారి తీసింది. సదరు ఈవీఎంలు అదనంగా అందుబాటులో ఉంచినవని ఈసీ వివరణ ఇచ్చింది. దీంతో పోలింగ్ జరిగిన మధ్యప్రదేశ్ - ఛత్తీస్‌ గఢ్ ల‌లో ఈవీఎంలను బీజేపీ ట్యాంపరింగ్ చేసి ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది.   నేపథ్యంలో స్ట్రాంగ్‌ రూమ్‌ లో దాచిపెట్టిన ఈవీఎంల భద్రత ఆందోళనకరమని పేర్కొంటూ ఈసీని సీనియర్ కాంగ్రెస్ నేతల ప్రతినిధి బృందం కలిసింది.ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వీఎల్ కాంతారావు ఆదివారం కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ లను తనిఖీ చేశారు. ఈవీఎంలు భద్రంగా ఉన్నాయని పేర్కొన్నారు.

కాగా, మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో ఈవీఎంల ట్యాంప‌రింగ్‌ ద్వారా బీజేపీ గెల‌వాల‌ని చూస్తోంద‌ని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఒక‌దాని వెంట మ‌రొక‌టి అన్న‌ట్లుగా జ‌రుగుతున్న ఘ‌ట‌న‌లు ఇందుకు ఆజ్యం పోస్తున్నాయ‌ని కాంగ్రెస్ పేర్కొంటోంది. అయితే, ఈవీఎల కంటే త‌మ పార్టీ ఓట‌మి గురించే కాంగ్రెస్‌కు భ‌యం ఉంద‌ని అందుకే ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తోంద‌ని బీజేపీ ప్ర‌తిస్పందించింది.

    

Tags:    

Similar News