కోదండకు 'అగ్గి' రాజేసే గుర్తునిచ్చిన ఈసీ

Update: 2018-10-24 05:53 GMT
తెలంగాణ రాజకీయాల్లోకి కొత్త మార్పులు తీసుకొస్తానని కలలుగంటున్న తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాంకు మొత్తానికి ఆందోళన తగ్గిపోయింది. కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అంటూ మహాకూటమికే సీట్ల కోసం ముచ్చెమటలు పట్టిస్తున్న ఆయనకు ఇప్పటికీ ఎన్నికల్లో పోటీచేసేందుకు గుర్తింపు లేకుండేది.. పార్టీ పెట్టినా అసలు ఎన్నికల గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించకపోవడంతో ఈ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలా అన్న మీమాంస ఆయన్ను వెంటాడేది. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా మంగళవారం సాయంత్రం ఈసీ కోదండరాం పార్టీ టీజేఎస్ కు అగ్గిపెట్టె గుర్తును కేటాయించింది.  జనసామాన్యంలో ఎంతో పాపులర్ అయిన ఈ అగ్గిపెట్టె గుర్తు తమ దశ మారుస్తుందని కోదండరాం ఆశతో ఉన్నారు..

అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ అగ్ని.. జమదగ్ని అంటూ ‘అగ్గిపెట్టే’ ఉందా అనే డైలాగును ఫేమస్ చేశారు. ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన కోదండరాం కూడా అచ్చం అదే డైలాగుతో తెలంగాణ ఎన్నికల కార్యక్షేత్రంలోకి దిగాలని ప్లాన్ చేస్తున్నారట.. అగ్గిపెట్టేతో అగ్గిరాజేసి ప్రత్యర్థులకు అంటించేసి గెలవాలని వ్యూహం సిద్ధం చేశాడట..

అగ్గిపెట్టె గుర్తు రావడంపై తెలంగాణ జనసమితి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అగ్గిపెట్టేతో తెలంగాణలో వెలుగులు ప్రసరింప చేస్తామని ప్రచారం చేసుకుంటున్నారు. అసలు అగ్గి లేనిదే మానవ నాగరికతే లేదని.. అగ్గిపుట్టుకే నాగరికతను మలుపు తిప్పిందని పేర్కొంటున్నారు. అగ్గిపెట్టే గుర్తు తెలంగాణ సమాజ వికాసానికి శ్రీకారం చుడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయంగా తొలి అడుగులు వేస్తున్న టీజేఎస్ కు ఎన్నికల వేళ గుర్తు కేటాయింపు జరిగి పెద్ద ఉపశమనం కలిగింది. కానీ కీలకమైన సీట్ల సర్ధుబాటే కావడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లను ఇస్తుందనేది సస్పెన్స్ గా మారడంతో టెన్సన్ పట్టుకుంది. గుర్తును ఎలాగో సాధించుకు వచ్చామని.. ఇక కాంగ్రెస్ నుంచి సీట్లను దక్కించుకోవడం ఒక్కటే మిగిలిందని నాయకులు చెబుతున్నారు. మరి వారి ఆశలు నెరవేరుతాయా.? సీట్లు అనుకున్నన్నీ వస్తాయా..? అగ్గిపెట్టే తో ప్రత్యర్థిని కోదండరాం అంటుపెడుతాడా అన్నది వేచిచూడాల్సిందే..
Tags:    

Similar News