ఇద్దరికీ షాకిచ్చిన ఎన్నికల కమీషన్

Update: 2022-10-09 05:59 GMT
పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చిందనే సామెత లాగ ఇద్దరిలో ఎవరికీ పార్టీ గుర్తును ఇవ్వకుండా కేంద్ర ఎన్నికల కమీషన్ ఫ్రీజ్ చేసింది. మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన పార్టీ గుర్తు బాణం-బిల్లు విషయంలో రెండు వర్గాల మధ్య జరుగుతున్న వివాదం అందరికీ తెలిసిందే. ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని కూల్చేసిన ఏక్ నాధ్ షిండే తమదే అసలైన శివసేన పార్టీగా క్లైమ్ చేస్తున్నారు. మెజారిటి ఎంఎల్ఏలు, పార్టీ కార్యవర్గాల మద్దతున్న తమకే పార్టీ గుర్తును కేటాయించాలని షిండే వాదిస్తున్నారు.

ఇదే సమయంలో శివసేన పార్టీ గుర్తు తమకే దక్కాలని పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే వాదిస్తున్నారు. కమీషన్ ఎదుట రెండు వర్గాలు పార్టీ గుర్తుపై వాదనలు వినిపించటమే కాకుండా కోర్టుల్లో కేసులు కూడా వేసుకున్నాయి. దాంతో కమీషన్ నిర్ణయమే ఫైనల్ అని ముంబాయ్ హైకోర్టు  చెప్పటంతో కమీషన్ పై ఒత్తిడి పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో తొందరలోనే ముంబాయి సిటీలో అంధేరీ ఈస్ట్ అసెంబ్లీ ఉపఎన్నిక జరగబోతోంది. ఈ ఎన్నికలో రెండు వర్గాలకు పార్టీ గుర్తును కేటాయించటానికి కమీషన్ నిరాకరించింది.

ఇద్దరిలో ఏ ఒక్కరికీ బాణం-విల్లు గుర్తును కేటాయించేది లేదని తెగేసి చెప్పేసింది. ఇద్దరు కూడా ఎన్నికల కమీషన్ నిబందనలకు లోబడి మరేదైనా గుర్తుకోసం దరఖాస్తు చేసుకోవాలని స్పష్టంగా చెప్పేసింది. రెండువర్గాలుకూడా కొత్తగుర్తుతోనే అంథేరి ఉపఎన్నికలో పోటీచేయాల్సుంటుంది. బహుశా రెండువర్గాల్లో ఎవరు గెలిస్తే వాళ్ళకే శివసేన అధికారిక చిహ్నాన్ని ఇవ్వాలని కమీషన్ అనుకుంటున్నదేమో.

ఒకవేళ రెండు వర్గాలు కూడా గెలవకపోతే ఏ వర్గానికి ఎక్కువ ఓట్లు వచ్చిందో చూస్తుందేమో. అయినా టెక్నికల్ గా చూస్తే పార్టీ గుర్తును సొంతం చేసుకునేందుకు రెండు వర్గాలకు కొన్ని టెక్నికల్ పాయింట్లు అనుకూలంగా ఉన్నాయట. అందుకే కమీషన్ కూడా ఏ విషయాన్ని వెంటనే నిర్ణయించలేకపోతున్నది. చివరివరకు గొడవలు ఇలాగే కంటిన్యూ అయితే అసలు గుర్తునే ఫ్రీజ్ చేసేసి రెండు వర్గాలకు కొత్త గుర్తులను కేటాయించే అవకాశం కూడా ఉందట. అప్పుడు శివసేన గుర్తు బాణం-విల్లు ఇండిపెండెంట్ అభ్యర్ధులకు కేటాయించినా ఆశ్చర్యంలేదు.
Tags:    

Similar News