జ‌మిలీ ఎన్నికలు...కీల‌క ముంద‌డుగు

Update: 2018-05-10 11:40 GMT

లోక్‌ సభకు - రాష్ర్టాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణపై కీల‌క ముంద‌డుగు ప‌డింది. దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాల గురించి చర్చించాలని ఎన్నికల సంఘం (ఈసీ) - లా కమిషన్ సిద్ధమయ్యాయి. ఈ మేరకు ఈ నెల 16వ తేదీన చర్చలకు రావాలని లా కమిషన్ చైర్మన్ జస్టిస్ బీఎస్ చవాన్ (రిటైర్డ్) - ఇతర ఉన్నతాధికారులకు ఈసీ ఆహ్వానం పంపింది. జమిలి ఎన్నికలపై లా కమిషన్ నిర్దిష్ట కార్యనిర్వహణ పత్రాన్ని విడుదల చేసిన ఒక రోజు తర్వాత సమావేశం నిర్వహించాలని నిర్ణయించడం గమనార్హం. 2019తో ప్రారంభమయ్యే విధంగా లోక్‌ సభ - రాష్ర్టాల అసెంబ్లీలకు రెండు దశల్లో జమిలి ఎన్నికలు నిర్వహించాలని లా కమిషన్ పేర్కొంటున్నది. ఇందుకోసం రాజ్యాంగంలోని కనీసం రెండు నిబంధనలను సవరించాల్సి ఉంటుంది. ఈ సవరణను మెజార్టీ రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించాలి. దీంతోపాటు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని కొన్ని నిబంధనలను సాధారణ మెజార్టీతో పార్లమెంట్‌ లో ఆమోదించాలి.

లా కమిషన్ కార్యనిర్వహణ పత్రం ప్రకారం రెండో దశ జమిలి ఎన్నికలు 2024లో జరుగుతాయి. ఒక రాష్ట్రంలో ప్రభుత్వం మధ్యలోనే పడిపోయి అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు వస్తే తిరిగి ఎన్నికయ్యే ప్రభుత్వం మళ్లీ సాధారణ ఎన్నికల వరకు ఎంతకాలం సమయం ఉన్నదో ఆ కాలనికి మాత్రమే పరిపాలన సాగిస్తుంది. అంతేగాని ఐదేళ్ల‌ కాలానికి కాదు. తరచూ ప్రభుత్వాలు పడిపోకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత వెంటనే విశ్వాస తీర్మానానికి అవకాశం ఉండాలని లా కమిషన్ పత్రం పేర్కొంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యాబలం గనుక ప్రతిపక్షాల వద్ద లేకపోతే అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని తొలిగించడానికి వీలుండదు. ఇదిలాఉండగా, జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే భారీ ఎత్తున అవసరమయ్యే యంత్రాలు, ఇతర మౌలికవసతుల కోసం రూ.9 వేల కోట్లు కావాలని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది.
Tags:    

Similar News