కీల‌క ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ రెఢీ చేశారా?

Update: 2018-02-27 05:37 GMT
మోడీ ఎంత మొన‌గాడైనా.. ఆయ‌న‌కు దేశంలో తిరుగులేని పాపులార్టీ ఉంద‌ని చెప్పినా.. అదేమీ ఇప్ప‌టివ‌ర‌కూ ద‌క్షిణాదిన మాత్రం ఫ్రూవ్ కాలేదు. సౌత్ లో పాగా వేయ‌టానికి మోడీ ఎంత‌గా త‌హ‌త‌హ‌లాడ‌తారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఆయ‌న ఎంత త‌పిస్తున్నా.. సౌత్ ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని గెలుచుకునే విష‌యంలో మోడీ ఎప్పుడూ వెనుక‌బ‌డే ఉన్నారు. అంతోఇంతో తెలుగు ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని గెలుచుకునే ఛాన్స్ ఉన్నా.. త‌న ఇరుకు మ‌న‌స్త‌త్వంతో పాటు ఏపీ ఎక్క‌డ అభివృద్ధి చెందుతుందోన‌న్న భావ‌న మోడీ నిర్ణ‌యాల మీద ప్ర‌భావం చూపింద‌ని చెబుతుంటారు.

ఎప్పుడైతే అమ‌రావ‌తి శంకుస్థాప‌న‌కు రెండు చిన్న కుండ‌ల్లో మ‌ట్టి.. నీళ్లు తీసుకొచ్చి.. దాన్నే బ‌హుమ‌తిగా ఇచ్చారో.. ఆ రోజే ఏపీమీదా ఏపీ రాజ‌ధాని మీదా.. ఏపీ ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని గెలుచుకునే విష‌యంలో త‌న‌కున్న ఫీలింగ్ ను చెప్పేశారు.

ఏపీకి కొత్త ఫ్యూచ‌ర్ ఇచ్చే అవ‌కాశం ఉన్న ప్ర‌త్యేక హోదాను ప‌క్క‌న పెట్టేసి.. పిచ్చి లెక్క‌లు చూపిస్తూ అడ్డ‌గోలు వాద‌న‌ల‌తో నిధుల విడుద‌ల విష‌యంలో ఎప్ప‌టిక‌ప్పుడు కొర్రీలు పెట్ట‌టంలో మోడీ స‌ర్కారు మొన‌గాడిన‌తాన్ని ప్ర‌ద‌ర్శించింది. ఇందుకు త‌గ్గ‌ట్లే.. ఇప్పుడు మోడీ అంటేనే ఏపీ ప్ర‌జ‌లు మండిపోతున్న ప‌రిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అమ్మ మ‌ర‌ణం అనంత‌రం త‌మిళ‌నాడులో మోడీ బ్యాచ్ క‌దిపిన ఎత్తులు త‌మిళ ప్ర‌జ‌ల్లో మోడీ ప‌ట్ల మ‌రింత వ్య‌తిరేక‌త పెంచ‌ట‌మే కాదు.. ఆయ‌న పేరు ఎత్తితేనే విసుక్కుంటున్నారు. మోడీతో చేతులు క‌లిపిన పార్టీకి సైతం శిక్ష‌ను విధించేందుకు త‌మిళ ఓట‌ర్లు సిద్ధంగా ఉన్నార‌ని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. గ‌తంలో క‌ర్ణాట‌క కోట మీద కాషాయ జెండాను ఎగుర‌వేసిన‌ప్ప‌టికీ.. సొంత త‌ప్పుల‌తో అధికారాన్ని మిస్ చేసుకున్న నేప‌థ్యంలో.. ఇప్పుడా రాష్ట్రంలో మ‌ళ్లీ ప‌వ‌ర్లోకి రావాల‌ని మోడీ అండ్ కో భావిస్తోంది. సౌత్ లో బోణీ కొట్టాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న మోడీ బ్యాచ్‌ కు క‌ర్ణాట‌క రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు కీల‌కం కానున్నాయి. నార్త్‌.. ఈస్ట్ లోనే కాదు.. సౌత్ లోనూ మోడీ హ‌వా న‌డుస్తుంద‌ని స్ప‌ష్టం చేసేందుకుఆధారం కావాలి. అందుకు క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాలు చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ‌లుగా మారాలి. ఇందుకోసం మోడీ అండ్ కో భారీ వ్యూహాన్ని సిద్ధం చేసింద‌ని చెబుతున్నారు.

పోల్ మేనేజ్ మెంట్లో మోడీని కొట్టినోళ్లు లేర‌నే చెప్పాలి. మ‌రోవైపు వృద్ధ కాంగ్రెస్ పార్టీకి మోడీ మాదిరి పోల్ మేనేజ్ మెంట్ ట్రిక్స్ ను ప్లే చేయ‌టం రాదు. ఈ కాంబినేష‌న్లో జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో క‌ర్ణాట‌క ఓట‌ర్ల తీర్పు ఎలా ఉంటుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ ను విడుద‌ల చేయ‌టానికి ఎన్నిక‌ల సంఘం డేట్ ఫిక్స్ చేసిన‌ట్లుగా చెబుతున్నారు. స్కూల్ బోర్డు ప‌రీక్ష‌లు పూర్తి అయిన వెంట‌నే ఏప్రిల్ రెండో వారంలో అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కానున్న‌ట్లు చెబుతున్నారు. 224 మంది అసెంబ్లీ స‌భ్యులున్న క‌ర్ణాట‌క అసెంబ్లీ గ‌డువు మే 28తో ముగ‌స్తుంది. ఈ లోపు ఎన్నిక‌లు నిర్వ‌హించి.. కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ద‌క్షిణాదిన పాగా వేయాల‌ని త‌పిస్తున్న మోడీకి.. క‌న్న‌డ ప్ర‌జ‌ల తీర్పు ఏ విధంగా ఉంటుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News