ఉప ఎన్నికల వేళ ఈసీ షాక్.. దళితబంధుకు బ్రేక్

Update: 2021-10-19 04:08 GMT
కేసీఆర్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న దళితబంధు పథకం అమలును కేంద్ర ఎన్నికల సంఘం బ్రేకులు వేసింది. తాజాగా జరుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో.. ఈ పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న వేళ.. ఓటర్లు ప్రలోభానికి గురి కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా ఈసీ వెల్లడించింది. ఉప ఎన్నిక తర్వాత యథావిధిగా ఈ పథకాన్ని అమలు చేయొచ్చని స్పష్టం చేసింది.

దళితబంధు కింద అర్హులైన లబ్థిదారులకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించటం.. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. దళితులకు మాత్రమే ఈ పథకంలో భాగస్వాములు అవుతారు. ఆర్థికంగా వెనుకబడిన దళితులకు తొలుతఈ పథకాన్ని అమలు చేసి.. తర్వాతి కాలంలో దళితుల్లోని అందరికి.. చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

దళిత బందు పథకాన్ని తొలుత వాసాలమర్రిలో అమలు చేసి.. ప్రయోగాత్మకంగా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అమలు చేస్తున్నారు. ఇప్పటికే వేలాది మందికి ఈ పథకం ద్వారా రూ.10లక్షల సాయాన్ని అందించారు. వారిలో అత్యధికులు ట్రాక్టర్లు.. కార్లు కొనుగోలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ పథకాన్నితాత్కాలికంగా ఆపాలంటూ ఈసీ బ్రేకులు వేసిన వైనం హుజూరాబాద్ ఎన్నిక మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.


Tags:    

Similar News