మోడీజీ.. మీ సాయం మరీ ఇంత తక్కువా?

Update: 2020-05-14 05:15 GMT
కంటికి కనిపించని శత్రువుతో ప్రపంచం పోరాడాల్సిన ప్రత్యేక పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. కలలో కూడా ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ.. యావత్ ప్రపంచమే ఆగమాగం అవుతున్న పరిస్థితి. వారాల తరబడి.. ప్రజలు ఇళ్లకే పరిమితం కావటం.. పని చేసే అవకాశం చాలా తక్కువ మందికే ఉండటం తెలిసిందే. ఒక్క తుపాకీ తూటా బయటకు రాకున్నా.. ఒక శతఘ్ని పేలకున్నా.. ఒక క్షిపణి విధ్వంసం చేయనప్పటికీ.. కోట్లాది ప్రజలు ఆకలితో హాహాకారాలు చేసే సిత్రమైన పరిస్థితి ఇప్పుడు నెలకొంది.

ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఆయా దేశాలు తమ ప్రజల్ని ఆదుకునేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఇందులో భాగంగా పలు దేశాలు ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. నేతిబీరలో నేత చందంగా.. తాజాగా మోడీ సర్కారు ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ ఉందని చెప్పాలి. ఇంకా దానిపై పూర్తి క్లారిటీ రానందున.. దాన్ని లెక్కలోకి తీసుకోకుండా ఇప్పటివరకూ కేంద్రం అందించిన సాయం లెక్క తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే.

మాట్లాడిన ప్రతిసారీ కొండంత స్ఫూర్తినిచ్చినట్లుగా మాట్లాడే మోడీ మాష్టారు.. చేతుల్లోని రూపాయిల్ని మాత్రం ప్రజలకు ఇచ్చే విషయంలో మాత్రం ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. ఈ విషయంలో నిజమెంతన్నది తాజాగా వెల్లడైన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పాలి. మాయదారి రోగంతో ఆర్థిక రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలింది.

దీనికి చికిత్స చేసేందుకు ఆయాదేశాలు ప్రత్యేక ప్యాకేజీల్ని ప్రకటించాయి. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా దేశ ప్రజలకు అందిన సాయంలో దేశం 19 స్థానంలో నిలిచింది. హాంకాంగ్.. కోస్తారికా.. కెనడా లాంటి దేశాల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారికి నగదురూపంలో అక్కడి ప్రభుత్వాలు సాయం చేయగా.. నెదర్లాండ్స్ కంపెనీల్లో పని చేసే ఉద్యోగస్తులకు 90 శాతం వరకు వేతనాల్ని అక్కడి ప్రభుత్వమే ఇచ్చేందుకు ఓకే చెప్పింది. పరిస్థితి చక్కబడే వరకూ వేతనాల్ని ప్రభుత్వమే చెల్లించేలా ప్యాకేజీ రూపొందిస్తే.. ఫ్రాన్స్ ప్రభుత్వం వేతనాల్లో 84 శాతాన్ని చెల్లిస్తోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. అగ్రరాజ్యం అమెరికా..చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ప్యాకేజీని ప్రకటించింది. 2.5లక్షల కోట్ల డాలర్లకు పైనే ప్యాకేజీని ప్రకటించింది. ఆయా దేశాలు జీడీపీలో ఎంత శాతం ప్యాకేజీని ప్రకటించాయన్నది చూస్తే.. అందరి కంటే జపాన్ మొదటిస్థానంలో నిలుస్తుంది. జీడీపీలో 21.1 శాతాన్ని ప్యాకేజీగా ప్రకటిస్తే.. తర్వాతి స్థానంలో అమెరికా 13.3 శాతంతో నిలిచింది. ఆస్ట్రేలియా 10.8 శాతం.. జర్మనీ 10.7 శాతం ప్రకటించింది. భారత్ మాత్రం ఇప్పటివరకు రూ.26.5వేల కోట్లను ప్యాకేజీ రూపంలో ప్రకటించారు. మోడీ మాస్టారి 20 లక్షల కోట్లను పరిగణలోకి తీసుకుంటే గణాంకాలు బాగున్నా.. సగటుజీవికి కలిగిన లాభం ఏమిటో ఎంతకూ అర్థం కాని పరిస్థితి.
Tags:    

Similar News