మోడీ ప్యాకేజీ ఏమో కానీ రూ.3.65లక్షల కోట్లు సంపద ఆవిరైందిగా?

Update: 2020-05-19 06:30 GMT
రేపొచ్చొ రూపాయి సంగతేమో కానీ.. చేతిలో పావలా కనిపించకుండా పోతే ఎలాంటి పరిస్థితి ఉంటుందో.. తాజాగా అలాంటి పరిస్థితినే స్టాక్ మార్కెట్ కు ఎదురవుతోంది. కేంద్రంలోని మోడీ విధానాలతో అనూహ్యంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. లక్షలాది కోట్లు ఆవిరి కావటంతో లక్షలాది మందికి షాకింగ్ గా మారింది.

దేశం ఎదుర్కొంటున్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో.. వివిధ వర్గాల్ని ఆదుకుంటామని కేంద్రం బడాయి కబుర్లు చెప్పటం తెలిసిందే. దీంతో.. బోలెడన్ని ఆశలు.. ఆకాంక్షలు వెలువడ్డాయి. తీరా చూస్తే.. తెలుగు టీవీ సీరియల్ కు ఏ మాత్రం తీసిపారేయని రీతిలో కేంద్రం చేపట్టే అంశాల్ని ఉదరగొట్టటం ద్వారా షాకిచ్చారు.

దీంతో.. ప్యాకేజీ ప్రకటించినంతనే మార్కెట్లు సానుకూలంగా స్పందిచాయి.కానీ.. రోజులు గడిచేకొద్దీ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలమ్మ నోటి నుంచి వచ్చే మాటలతో ఉపశమనం తర్వాత..కొత్త ఇరిటేషన్ కు కారణమవుతున్నాయి. పేరుకు రూ.20లక్షల కోట్లే కానీ.. రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ.. ఇతర రంగాలకు కానీ.. సామాన్యులకు కానీ నేరుగా ఎలాంటి ప్రయోజనాన్ని కలిగించని పరిస్థితి.

ఈ ప్రభావం సోమవారం మీద పడింది. స్టాక్ మార్కెట్లు ప్రతికూలంగా స్పందించటంతో భారీ ఎత్తున మదుపరుల సొమ్ము గాల్లో ఆవిరయ్యాయి. చూస్తుండగానే కళ్ల ముందు షేర్ ధరలు దారుణంగా పడిపోవటంతో.. సోమవారం ఒక్కరోజు ముగిసేసరికి సెన్సెక్స్ వెయ్యి అరవై తొమ్మిది పాయింట్లు కోల్పోతే..నిఫ్టీ ఏకంగా 314 పాయిట్లు నష్ట పోయింది. దీంతో.. మదుపరుల సొమ్ము చూస్తుండగానే రూ.3.65లక్షల కోట్లు గాల్లో అవిరైంది. ప్రజల్ని.. పలు వర్గాల వారిని ఆదుకోవటం కోసం భారీ ప్యాకేజీ ప్రకటించటం తో ఎలాంటి లాభం లేకపోగా.. ఇలాంటి కుదుపులతో మరింత దారుణమైన పరిస్థితి ఎదురవుతుందని చెబుతున్నారు. మీరు ఇవ్వటం తర్వాత.. ఇస్తున్నట్లు ప్రకటన ఇవ్వకుంటే చాలన్న వేడికోళ్లు మోడీకి మొదలవుతాయన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News