ఈడీ అరెస్ట్ లు: టీఆర్ఎస్ నేతల ఫోన్లు స్విచ్ఛ్ ఆఫ్.. ఏం జరుగుతోంది?

Update: 2022-09-28 13:45 GMT
అనుకున్నట్టే కేంద్రంలోని బీజేపీ తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేసింది. వారి లూప్ హోల్స్ వెతికి మరీ కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులకు పురిగొల్పుతోంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం, కేసినో స్కాంలో పలువురు టీఆర్ఎస్ నేతల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పుడు అరెస్ట్ లు మొదలుకావడంతో కీలక టీఆర్ఎస్ నేతలంతా తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసుకున్న పరిస్థితి నెలకొంది.

ఇక తాజాగా టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలోనూ పార్టీ అధినేత కేసీఆర్ కీలక నేతలను హెచ్చరించారు. రాష్ట్రంలో సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు జరగవచ్చని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినట్టు సమాచారం. ఆయన చెప్పినట్టుగానే హైదరాబాద్ లో చాలా చోట్ల ఈడీ దాడులు జరిగాయి. ఆ సమయంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం తెలంగాణలో రాజకీయ రచ్చకు తెరలేపింది.

ఈ వ్యవహారంలో ఈ టీఆర్ఎస్ నేత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తాజాగా అరెస్ట్ లు మొదలు కావడంతో ఈ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలంతా ఫోన్లు స్విచ్ఛ్ ఆఫ్ చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. దీంతో ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో అలజడి రేపుతోంది. టీఆర్ఎస్ క్యాడర్ లో ఆందోళనకు కారణం అవుతోంది.

మీడియాలో అరెస్ట్ ల పర్వం మొదలుకావడంతో గులాబీ నేతలకు కిందిస్థాయి నేతలు ఫోన్లు చేసి ఆరాతీస్తున్నారు. కానీ చాలా మంది టీఆర్ఎస్ కీలక నేతలు ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకున్నట్టు సమాచారం. దీంతో తమ నేత అరెస్ట్ అవుతాడన్న ఆందోళన కార్యకర్తల్లో నెలకొంది.

ఇక జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు వైరల్ అవుతున్నాయి. టీఆర్ఎస్ ముఖ్య నేత, కేసీఆర్ కుడిభుజంగా ఉండే ఓ నేత ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యిందని.. కేసీఆర్ అలెర్ట్ చేయడంతోనే ఇలా స్విచ్ఛాఫ్ చేసుకున్నాడని వార్తలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారం ఎటువైపు దారితీస్తోందనన్న ఆందోళన గులాబీ పార్టీలో సాగుతోంది.

చాలా మంది టీఆర్ఎస్ నేతలు ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది. కనీసం తమ అనుచరులకు కూడా అందుబాటులో ఉండడం లేదని సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కాం, కేసినో స్కాంలో టీఆర్ఎస్ నేతలను బుక్ చేయాలని చూస్తున్నారని.. ఈ మేరకు అరెస్ట్ లకు ఈడీ సిద్ధమైందన్న సమాచారంతోనే ఇలా టీఆర్ఎస్ నేతలు మూకుమ్మడిగా ఫోన్లు స్విచ్ఛ్ ఆఫ్ చేసుకొని కనిపించకుండా పోతున్నారని ప్రచారం సాగుతోంది.

మొత్తంగా తెలంగాణ రాజకీయాలను ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాంతోపాటు కేసినో కేసు షేక్ చేస్తోంది. అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News