జగన్ కు భారీ దెబ్బ..749 కోట్ల ఈడీ అటాచ్

Update: 2016-06-29 13:29 GMT
ఎప్పుడోఒకసారి తప్పదని అంచనా వేస్తున్న దృశ్యం ఒకటి ఆవిష్కృతమైంది. ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాజకీయంగా ఆచితూచి అడుగులు వేస్తూ.. తాను నొచ్చుకున్నా.. ‘‘కొందరిని’’ నొప్పించకుండా జాగ్రత్త పడినా.. ఆయనకు ఇబ్బందికర పరిస్థితి తప్పలేదు. తాజాగా ఆయనకు సంబంధించిన రూ.749 కోట్ల ఆస్తుల్ని తాత్కాలికంగా జఫ్తు చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది.

తాజాగా జారీ చేసిన ఈ ఆదేశాల్లో జగన్ కు చెందిన కీలకమైన ఆస్తులు ఉండటం గమనార్హం. ప్రస్తుతం హైదరాబాద్ లో జగన్ నివాసమైన లోటస్ పాండ్ తో పాటు.. సాక్షి టవర్స్.. బెంగళూరులోని అత్యంత ఖరీదైన మంత్రి కామర్స్ భవన సముదాయంతో పాటు.. జగన్ సతీమణి భారతికి సంబంధించిన పలు షేర్లను కూడా అటాచ్ మెంట్ చేయటం గమనార్హం.

వీటన్నింటితో పాటు భారతి సిమెంట్స్ కు రూ.152 కోట్ల సున్నపు రాయిని అక్రమంగా కేటాయించినట్లుగా ఈడీ నిర్ధారించింది. ఇప్పటివరకూ ఈడీ కొన్ని ఆస్తుల మీద అటాచ్ చేసినప్పటికీ.. తాజా అటాచ్ మెంట్లు జగన్ ఆర్థిక మూలాల్ని దెబ్బ తీసేలా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలో ఏపీ అధికారపక్ష నేతలు సాక్షిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందంటూ తరచూ వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకోవటం గమనార్హం.
Tags:    

Similar News