క్యాసినో కేసులో ఎమ్మెల్సీ ర‌మ‌ణ.. విచారిస్తున్న ఈడీ

Update: 2022-11-18 08:32 GMT
తెలంగాణ స‌హా ఏపీని కుదిపేసిన చీకోటి క్యాసినో వ్య‌వ‌హారంపై ఈడీ త‌న విచార‌ణ‌ను మ‌రింత ముమ్మ‌రం చేసింది. ఈ  కేసులో టీడీపీ మాజీ నాయ‌కుడు, ప్ర‌స్తుత టీఆర్ ఎస్‌ ఎమ్మెల్సీ ఎల్. రమణ ఈడీ  విచారణకు హాజరయ్యారు. బ్యాంక్‌ స్టేట్‌మెంట్ ను సైతం తీసుకుని వెళ్లిన రమణను ఈడీ జూన్‌లో నేపాల్‌లో నిర్వహించిన 'బిగ్‌ డాడీ' ఈవెంట్‌పై ప్రశ్నిస్తోంది.

చికోటి ప్రవీణ్‌ నుంచి తనకు నేపాల్‌ ఈవెంట్‌కు ఆహ్వానం అందిందని.. కానీ, తాను వెళ్లలేదని ఎల్‌.రమణ చెప్పిన‌ట్టు తెలిసింది. నేపాల్‌లో జరిగిన ఈవెంట్లపై ఎల్‌.రమణను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. క్యాసినో కేసులో 18 మంది రాజకీయ నేతలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాద‌వ్ సోదరులతో పాటు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గరునాథ్‌రెడ్డిని ఈడీ ప్రశ్నించింది.

అదేవిధంగా వైసీపీ నాయ‌కురాలు, క‌ర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక సోద‌రుడిని కూడా ఈడీ విచారిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈయ‌న పంజాగుట్ట‌లో ఒక బార్ యజ‌మాని. ఇదిలావుంటే, 'వెగాస్ బై బిగ్ డాడీ' పేరుతో స్పెషల్ ఈవెంట్స్‌‌ను చికోటి ప్రవీణ్ నిర్వహించాడు. మే నెలలో కొన్ని చోట్ల, జూన్‌లో గోవా, నేపాల్‌లో.. భారీగా చికోటి ప్రవీణ్‌కుమార్‌ ఈవెంట్స్‌ నిర్వహించాడు. ఈ ఈవెంట్స్‌కు పలువురు రాజకీయ నేతలు హాజరయ్యారు.

ర‌మ‌ణ‌కు అస్వ‌స్థ‌త‌! క్యాసినో కేసులో విచారణ జరుగుతుండగానే ఎల్ రమణ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఈడీ అధికారులు ఆయనను ఆసుపత్రికి తరలించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News