టీఆర్ఎస్ ఎమ్మెల్యేను విచారిస్తున్న ఈడీ

Update: 2022-09-27 12:33 GMT
అనుకున్నట్టు కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఈడీతో టీఆర్ఎస్ మీద పడిపోయింది. కొద్దిరోజుల క్రితం వెలుగుచూసిన క్యాసినో వ్యవహారంలో ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఈరోజు విచారించారు. హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో మంచి రెడ్డి ఈరోజు విచారణకు హాజరయ్యారు.

ఈడీ కార్యాలయానికి వచ్చేవరకూ ఆయనకు నోటీసులు అందాయన్న విషయం బయటకు తెలియదు. దీంతో ఆయనను ఏ కేసులో విచారణకు పిలిచారన్నది ఆసక్తి రేపుతోంది.

ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాలపైనే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఈడీ అధికారులు  కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు తెలిసింది. ఈ మధ్యాహ్నం నుంచి ఆయనను ప్రశ్నిస్తున్నారు. బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వివరాలపై ఈడీ అధికారులు ఆరాతీస్తున్నట్టు తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల నుంచి పక్కదేశాలకు క్యాసినో వ్యవహారంలో తరలించిన కేసులో చీకోటి ప్రవీణ్ ను ఈడీ విచారించింది. అతడి నుంచి పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అందులో మంచిరెడ్డికి సంబంధించిన లావాదేవీలు ఉన్నాయని.. అందుకే ఆయనను పిలిపించారని అంటున్నారు. చీకోటి ప్రవీణ్ హవాలా దందాను కూడా భారీ ఎత్తున చేపట్టినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.

అయితే కేసీనోలకు వెళ్లే అలవాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డికి లేదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈడీ ఇతర వ్యాపార లావాదేవీల విషయంలోనూ ఆయనను పిలిపించి ఉంటుందని చెబుతున్నారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టారా? అన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇండోనేషియా బంగారు గనుల్లో మంచిరెడ్డికి పెట్టుబడులు ఉన్నాయని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఆ విషయమై పిలిపించారని అంటున్నారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఈడీ విచారణకు పిలవడంతో టీఆర్ఎస్ నేతల్లో ఆందోళన మొదలైంది. ఈడీ భయం పట్టుకుంది.  తమకూ ఈ కేసు చుట్టుకుంటుందా? అన్న ఆందోళనలో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం, క్యాసినో కేసుల్లో పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News