మీడియా హౌస్లో ఈడీ సోదాలు

Update: 2022-10-08 05:44 GMT
రాజకీయ నేతలకు సంబంధించిన ఇళ్ళు, ఆఫీసులు, ఐటి సంస్ధలపై మాత్రం ఇంతకాలం దాడులు చేస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉన్నతాధికారులు మొదటిసారిగా మీడియా హౌస్లో కూడా సోదాలు చేశారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్ పోస్టు దగ్గరున్న ఆంధ్రప్రభ ఆఫీసులో చాలసేపు సోదాలు జరిగాయి. సంస్ధ యాజమాన్యం ముత్తా గోపాలకృష్ణను ఈడీ ఉన్నతాధికారులు విచారించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు లింకుల ఆధారంగానే ఇపుడు మీడియా ఆపీసులో కూడా సోదాలు, విచారణ జరిగినట్లు సమాచారం.

లిక్కర్ స్కాం కుంభకోణంలో పాత్ర ఉందని అనుమానిస్తున్న ఇద్దరు మీడియాలో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీకి ఆధారాలు దొరికాయి. లిక్కర్ కుంభకోణంలో ఒకరైన అర్జున్ పాండే ముత్తా ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంగ్లీషు ఛానల్ ఇండియో అహేడ్ కు గతంలో కొంతకాలం సేల్స్ డిపార్టుమెంటు హెడ్ గా పనిచేశారట. అలాగే మరో వ్యక్తి బోయినపల్లి అభిషేక రావు ఈ ఛానల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ దగ్గర ఆధారాలున్నాయట.

మొత్తానికి అటు తిరిగి ఇటు తిరిగి ఈడీ సోదాలు, విచారణ చివరకు మీడియా హౌస్ ను కూడా తాకింది. ఒకపుడు ముత్తా గోపాలకృష్ణ కూడా మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఇపుడు ఆయన కొడుకు ముత్తా శశిధర్ జనసేనలో యాక్టివ్ గా ఉన్నారు.

సరే కారణాలు ఏవైనా లిక్కర్ స్కాం నిందితులతో చేతులు కలపటం, వాళ్ళ పెట్టుబడులుండటం అనే ఆరోపణలపై ఇపుడు ఈ మీడియా హౌస్ పై దాడులు జరిగాయి.

ఇపుడు బయటపడింది ఆంధ్రప్రభ యాజమాన్యం మాత్రమే అయినా ముందు ముందు ఇంకెన్ని మీడియా హౌస్ లకు లిక్కర్ స్కామ్ తో సంబంధాలున్నాయని ఈడీ ఉన్నతాధికారులు చెబుతారో తెలీటంలేదు. చాలామంది రాజకీయనేతలకు అనేక మీడియా యాజమాన్యాలతో విడదీయలేని సంబంధాలే ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే భవిష్యత్తులో మరిన్ని మీడియా హౌస్ లపై ఈడీ దాడులు, సోదాలు చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News