కామినేని గ్రూప్‌ పై ఈడీ సోదాలు.. రీజ‌నేంటి?

Update: 2023-06-21 18:15 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరొందిన కామినేని గ్రూప్ మెడికల్ సంస్థ‌ల‌పై ఈడీ అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. కామినేని గ్రూప్ చైర్మన్, ఎండీ నివాసాలపై సోదాలు జరుగుతున్నాయి. తెలంగాణలో మొత్తంగా 15 చోట్ల ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్‌లో సైతం సోదాలు జరుగుతున్నా యి. అలాగే మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కళాశాలలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.

షామీర్‌పేటలోని మెడిసిటీ కళాశాలలో స్థానిక ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అలాగే.. ఫిల్మ్ నగర్ లోని ప్రతిమా కార్పొరేట్ కార్యాలయంపై సోదాలు నిర్వహిస్తోంది. ఈడీ అధికారులు రెండు టీమ్స్‌గా విడిపోయి మరీ సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రతిమా గ్రూప్‌కి చెందిన ఆర్ధిక లావాదేవీలపై ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌లో మరోసారి ఈడీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి.

ఇటీవలే పలువురు బీఆర్ఎస్ నేతల ఇళ్లు, కార్యాలయాలపై దాడులను ఈడీ నిర్వహించిన విషయం తెలిసిందే. వారిని విచారణకు సైతం రమ్మంటూ నోటీసులు జారీ చేసింది. నేడు బషీర్ బాగ్‌లోని ఈడీ కార్యాలయం నుంచి ఈడీ అధికారులు 11 బృందాలుగా వెళ్లారు.

భారీగా సీఆర్పీఎఫ్ బలగాలతో ఈడీ బృందాలు సోదాలు నిర్వ‌హిస్తుండ‌డం సంచ‌ల‌నంగా మారింది. హైదరాబాద్‌తో పాటు నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్, మేడ్చల్, ఖమ్మం జిల్లాలో ఈడీ రైడ్స్ జ‌రుగుతున్నాయి.

కార‌ణం ఇదేనా?ఇటీవ‌ల కాలంలో కార్పొరేట్ మెడిక‌ల్ కాలేజీలు.. వైద్య సంస్థ‌ల‌పై ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. క‌రోనా స‌మ‌యంలో అధికంగా ఫీజులు వ‌సూలు చేయ‌డం.. దీనికి సంబంధించి ఐటీ దాఖ‌లు చేయ‌క‌పోవ‌డంపై అనేక ఫిర్యాదులు అందాయి.

పైగా క‌రోనా స‌మ‌యంలో వ‌సూలు చేసిన సొమ్ముల‌తో మ‌నీ లాండ‌రింగ్ చేశార‌నే ఆరోప‌ణ‌లుకూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కేంద్ర ఐటీ శాఖ కొర‌డా ఝ‌ళిస్తున్న‌ట్టు చెబుతున్నారు.

Similar News